
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
టి ఎస్ అర్ టి సి మెజారిటీ యూనియన్ల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం “కార్మిక భరోసా యాత్ర” లో భాగంగా ఎంజీబీఎస్ కు వచ్చే రాష్ట్రవ్యాప్త కార్మికులకు మేమున్నామన్న భరోసాను కల్పిస్తూ ఆర్ టి సి కార్మికులకు కరపత్రం ఇచ్చి కార్మికుల సమస్యల పరిష్కారానికై మేమున్నామంటూ జేఏసి నాయకులు కార్మికులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా టి ఎస్ ఆర్ టి సి మెజార్టీ యూనియన్ల జేఏసీ చైర్మన్ ఇ అశ్వత్థామ రెడ్డి. కన్వీనర్ కే హనుమంతు ముదిరాజ్ లు మాట్లాడుతూ.. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం మాస్టర్ పే స్కేల్స్ అమలుపరుస్తూ పెండింగ్ లో ఉన్న పిఆర్సిలు 2017, 2021 ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు 2021 ఫిబ్రవరి విడుదల చేసిన ఉద్యోగ భద్రత గైడ్లైన్స్ రద్దుచేసి సెక్షన్ 112a (1) మోటార్ వెహికల్ యాక్ట్ 1939 ప్రకారం టికెట్ తీసుకునే బాధ్యత పూర్తిగా ప్రయాణికుడిగా నిర్ణయిస్తూ సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. బస్సులపై పనిచేస్తున్న డ్రైవర్లను సంస్థ ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జీతాలు చెల్లించాలన్నారు. ప్రభుత్వం 2023 జనవరి డీఏ చెల్లిస్తూ మొత్తం ఎనిమిది డీఏలకు సంబంధించిన అరియర్స్ కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ కండక్టర్లపై మోపిన పని భారాన్ని తగ్గించి ఎనిమిది గంటల పని దినాన్ని వెంటనే పునరుద్ద రించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జీవో లేబర్ యాక్ట్ ప్రకారం ఒకరోజులో ఎనిమిది గంటలు దాటిన పనికి డబుల్ వేజ్ చెల్లించాలన్నారు. చట్ట వ్యతిరేకంగా నిలిపివేసిన మెజార్టీ యూనియన్ ఎన్నికలను వెంటనే నిర్వహించే యూనియన్ కార్యకలాపాలను పునరుద్దిరీంచాలి అన్నారు. ఆర్టీసీని ప్రజా రవాణా సేవా సంస్థగా గుర్తించి తమిళనాడు ప్రభుత్వ తరహాలో డీజిల్ కొనుగోలు పై టాక్స్ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి అన్నారు. ప్రైవేట్ వాహనాల ద్వారా ప్రయాణికులను తరలిస్తున్న అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. ప్రభుత్వం నాంస్ ప్రకారం అన్ని విభాగాల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేసి ప్రమోషన్లు కల్పించాలన్నారు. అన్ని కేటగిరీలతోపాటు గ్యారేజీ లో ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి రెగ్యులర్ ప్రతిపాదికన రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లకు అనుగుణంగా రిక్రూట్మెంట్ చేయాలన్నారు. పక్క రాష్ట్రంలో లాగా టి.ఎస్.ఆర్.టి.సి ని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పారు. బస్ పాసుల రియంబర్స్మెంట్ డబ్బులతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఆర్టీసీకి ప్రభుత్వం ప్రతిఏటా 1500 లకోట్లను నాలుగు విడతల్లో రిలీజ్ చేయాలన్నారు ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సంస్థ పరిరక్షణకు. ఉద్యోగుల దీర్ఘకాల సమస్యల పరిష్కారం కోసం జేఏసీ యూనియన్లకు అతీతంగా కార్యాచరణ రూపొందించి ముందుకు వెళుతుందన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలపై వెంటనే స్పందించాలని లేకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఈ సమావేశంలో జేఏసీ కో -కన్వీనర్లు ఎం నరేందర్, పున్న హరికిషన్, సుద్దాల సురేష్, ఎర్ర స్వామి కుమార్, జి అబ్రహం, బి యాదగిరి, కామ్రేడ్ సత్యం, ఆర్ టిసి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.