ప్రజల అవసరాలే మా అజెండా

– అన్ని వర్గాల ప్రజలు భయంతో బతుకున్నారు
– త్వరలో సెల్పీ విత్‌ ప్రాజెక్ట్సు కార్యక్రమం : సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రలో వచ్చిన సమస్యలు, ప్రజల అవసరాలే ఎజెండాగా కాంగ్రెస్‌ పార్టీ ముందుకు పోతోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో మార్పు వచ్చేలా అన్ని అంశాలను మ్యానిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు. సంపద, వనరులు స్వేచ్ఛ ప్రజల కోసం తప్ప పాలకుల కోసం కాదని వివరించారు. శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో పార్టీ అధ్యక్షులు, రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొడెం వీరయ్య, పార్టీ సీనియర్‌ నేతలు వి హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, అంజన్‌కుమార్‌ యాదవ్‌, ఆజ్మతుల్లా, సిరిసిల్ల రాజయ్య, అధికార ప్రతినిధి బండి సుధాకర్‌గౌడ్‌తో కలిసి భట్టి విక్రమార్క తన పాదయాత్ర వివరాలను మీడియాకు వెల్లడించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అవన్నీ పాలకులకు పరిమితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో లేనంత దూరంగా ఉన్నాయనీ, వాటిని ప్రజల చెంతకు చేర్చడమే కాంగ్రెస్‌ లక్ష్యమన్నారు. బీఆర్‌ఎస్‌ భూస్వాముల పార్టీ, భారతీయ జనతా పార్టీ క్యాపిటలిస్టుల పార్టీ అని విమర్శించారు. ‘మన నీళ్లు మనకే, మన భూములు మనకే’ అనే నినాదాన్ని ఇవ్వాల్సిన అవసరముందన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ నేతలు రాష్ట్రంలో జీడీపీ పెరిగిందని చెబుతున్నారనీ, అది సంపన్నులకా? సామాన్యులకా? అని ప్రశ్నించారు. ఒకవైపు 40 గజాల ఇంటి స్థలం లేక అల్లాడిపోతున్న జనం, మరోవైపు 20 మిలియన్స్‌ చదరపు అడుగులు ఉన్న అమరేందర్‌రెడ్డి లాంటి సంపన్నులు ఉన్నారనీ, ఇంత వ్యత్యాసం ఉన్నా ఆదాయం సమానమే అని చెప్పడం పాలకులకు సమంజసమేనా? అని ప్రశ్నించారు.పేద, ధనిక వ్యత్యాసం మితిమీరిపోయినప్పుడు బ్యాలెన్స్‌ చేయాల్సిన బాధ్యత పాలకులకు ఉందన్నారు.
సెల్ఫీ విత్‌ ప్రాజెక్టు కార్యక్రమం
కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసిన ప్రాజెక్టులు వాటికి పెట్టిన ఖర్చు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలను సెల్ఫీ విత్‌ ప్రాజెక్టు ద్వారా ప్రజలకు వివరిస్తామని భట్టి తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలో నిర్మాణం చేసిన ప్రాజెక్టులను కుట్రపూరితంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని ఎండగడుతామన్నారు. ప్రాజెక్టుల వద్దకు వెళ్లి సెల్ఫీ దిగి అక్కడ జరుగుతున్న విషయాలను తెలంగాణ సమాజానికి చూపెడతామని చెప్పారు. ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో మీడియం ఇరిగేషన్‌ ప్రాజెక్టు ఎనిమిది 64 చెరువులు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్‌ ప్రభుత్వం డిజైన్‌ చేసి పనులు ప్రారంభించిందని తెలిపారు. కాళేశ్వరం ప్యాకేజీలు మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ప్రాజెక్టులు నిర్మాణం చేసినట్టు ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తగదనీ, అవి చెక్‌ డ్యాముల మాదిరిగా కట్టారని విమర్శించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కింద ఉన్న కాంతాలపల్లి రాజీవ్‌, ఇందిరా సాగర్‌ ప్రాజెక్టులను పదేండ్లుగా పూర్తి చేయకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు అనుమతులు లేక ఆగిపోయాయని తెలిపారు. ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ పనులు ఇప్పటికీ మొదలు కాలేదని తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ నక్కలగండి డిండి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనులు కాంగ్రెస్‌ హయాంలో ఎంతవరకు జరిగాయో అలాగే ఉన్నవి మిగతా పనులు పూర్తి చేయకుండా ఈ ప్రభుత్వం దున్నపోతు నిద్రపోతున్నదని తెలిపారు.బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దయచేసినట్టు గ్లోబల్స్‌ ప్రచారంతో తెలంగాణ మొత్తం బంగారు కుటుంబాలుగా మారినట్టు కథలతో తొమ్మిదిన్నరేండ్లుగా ప్రజలను దగా చేస్తున్నదని విమర్శించారు. నీళ్లు, ఇండ్లు, ఇంటి స్థలాలు, కొలువులు రాలేదనీ, పంటలకు మద్దతు ధర దొరకడం లేదనీ, వృత్తులు చేసుకుంటున్న వారికి ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి వల్ల ఆదివాసులు భూములపై హక్కులు లేకుండా పోయిందన్నారు. జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామనీ, ఆ చరిత్ర కాంగ్రెస్‌కే ఉందని ఒక ప్రశ్న సమాధానంగా చెప్పారు.
స్వేచ్ఛను హరిస్తున్న పోలీసు వ్యవస్థ
ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న పోలీస్‌ వ్యవస్థ గురించి ప్రతి గ్రామంలో ప్రజలు మాకు ఫిర్యాదులు చేస్తున్నారని విక్రమార్క చెప్పారు. క్షేత్రస్థాయి పోలీసుల నుంచి మమ్మల్ని కాపాడాలంటూ కోరుతున్నారని తెలిపారు. ఎస్సై, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులు పూర్తిగా ఎస్పీ, డీఐజీ, డీజీపీ ఉన్నతాధికారులతో డీ లింక్‌ అయ్యి అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆదేశాలను అమలు చేసే పోలీసులుగా మారిపోయారని విమర్శించారు. ‘ప్రశ్నిస్తే కేసులు, ఎదురుతిరిగితే జైళ్లు… ఇదేమంటే నిర్భంధాలు.. అడిగితే బెదిరింపులు. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పోలీసులు పని చేస్తున్నారు. మొత్తంగా తెలంగాణ సమాజం భయమనే పడగనీడలో బతుకుతోందని విక్రమార్క ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. దాన్ని నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి చేస్తామని హామీ ఇచ్చారు.
పీపుల్స్‌ పాదయాత్ర వివరాలు
‘హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలో భాగంగా పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర మార్చి 16న ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ నియోజకవర్గం పిప్పిరి గ్రామం నుంచి ప్రారంభమై…జులై 2న ఖమ్మం వరకు కొనసాగింది. 109 రోజులపాటు యాత్ర జరిగింది. 1364 కిలోమీటర్ల సాగింది. 36 నియోజకవర్గాల మీదుగా 17 జిల్లాల ద్వారా కొనసాగింది. 700 గ్రామాలు, 100కు పైగా కార్నర్‌ మీటింగ్స్‌, మంచిర్యాల, జడ్చర్ల, ఖమ్మంలో భారీ బహిరంగ సభలు జరిగాయి’ అని వివరించారు.