రేణుక నగర్‌కు రోడ్డు, బస్సు సౌకర్యం కల్పించండి

నవతెలంగాణ-జవహర్‌నగర్‌
జవహర్‌ నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ 2వ డివిజన్‌ లోని సర్వే నెం. 217, 221 రేణుకా నగర్‌ బస్తీకి ప్రధాన రాకపోకలకు రోడ్డు సమస్యను తీర్చాలని, అంబేద్కర్‌ నగర్‌ చెరువు పక్కన ఎఫ్‌ టి ఎల్‌ స్థలంలో రోడ్డు బస్‌ సౌకర్యం ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకు న్యాయం చేయాలని బీజేపీ జవహర్‌ నగర్‌ అధ్యక్షుడు రంగుల శంకర్‌ తో కలసి రాష్ట్ర బీజేపీ మాజీ ఉపాధ్యక్షులు, సీనియర్‌ నాయకులు కొంపెల్లి మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో కాప్రా మండల తహసిల్దార్‌ ఎస్తేర్‌ అనితను కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. ‘జవహర్‌ నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 2వ డివిజన్‌ లోని కార్మిక నగర్‌ సమీపంలోని రేణుకా నగర్‌ బస్తీ నివాసులు, దాదాపు 100 పైగా నివాసాలతో 15 సంవత్సరాలుగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. రేణుకా నగర్‌ బస్తీని ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాల యజమానులు వారి స్థలం నుండి రేణుక నగర్‌ బస్తీకి రాకపోకలు అనుమతించడం లేదు, చాలాకా లంగా ఈ వివాదం కొనసాగుతూ ఉంది. కానీ పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇటువైపు పట్టించుకునే నాధుడే లేక బస్తీ వాసుల సమస్య అరణ్య రోదనగా మారిందన్నారు. ఇటీవల మిషన్‌ భగీరథ పైప్‌ లైన్‌ రేణుకా నగర్‌ బస్తీ ప్రధాన రోడ్డు సమస్య వల్ల రాకుండా ఆగిపోయింది. జి.హెచ్‌.ఎం.సి. చెత్త డంపింగ్‌ యార్డ్‌ బస్తీ సమీపంలో ఉండ డం వల్ల భూగర్భ జలాలు కలుషితమై తీవ్ర మంచినీటి సమస్యతో అనునిత్యం బాధపడుతున్నారు.బస్తీని ఆనుకుని ఉన్న అంబేద్కర్‌ నగర్‌ చెరువు పక్కన ఎఫ్‌ టి ఎల్‌ స్థలం లో గుండా ఏ సమస్య లేకుండా రేణుకా నగర్‌ కు ప్రధాన రాకపోకలకు రోడ్డు వేసుకునే అవకాశం ఉంది. తద్వారా మిషన్‌ భగీరథ పైప్‌ లైన్‌ కూడా రేణుకా నగర్‌ బస్తీకి వేయవచ్చు. అధికారులు బీఆర్‌ఎస్‌ నాయకులు వెంటనే స్పందించి రోడ్డు కనెక్టివిటీ సమస్యను తీర్చాలి. బీజేపీ వివిధ మోర్చాలలో వివిధ స్థాయిల్లో బాధ్యతలు కలిగిన నాయకులు కమల్‌, సునీల్‌ నేత, మేకల నాగరాజు, బొమ్మ యాదగిరి, మందుల శ్రీధర్‌, నర్సాపురం కష్ణయ్య, శనిగరం కనకయ్య, గజం శ్రీనివాస్‌, రాజు, టపా మల్లికార్జున్‌ రెడ్డి, బస్తీ వాసులు పాల్గొన్నారు