తెలంగాణ అర్చక వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు అభినందనీయం

నవతెలంగాణ-సుల్తాన్‌బజార్‌
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం మొదటి సారిగా అర్చక సంక్షేమ నిధి ఏర్పాటుచేయడం అభినందనీయ మని అర్చక వెల్ఫేర్‌ బోర్డు సభ్యుడు కాండూరి కృష్ణమాచారి అన్నారు. దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ అర్చక బోర్డు నూతన కమిటీని ప్రకటించారు. బోర్డు సభ్యులుగా చిలకమర్రి శరవణ కుమారాచార్యులు, ఉద్యోగ తరపున కాండూరి కృష్ణమాచారి, ధూప, దీప నైవేద్యం అర్చకుడు జక్కాపురం నారాయణస్వామిలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కృష్ణమాచారి మాట్లాడుతూ తెలంగాణలో ఇప్పటి వరకు అర్చక వెల్ఫేర్‌ బోర్డు లేకపోవడంతో అర్చక, ఉద్యోగులకు వచ్చే ప్రయోజనాలు అందకుండా పోయాయన్నారు. రాష్ట్రంలోని అర్చకుల సమస్యలు తెలుసుకున్న సీఎం కేసీఆర్‌ నూతనంగా వెల్ఫేర్‌ బోర్డును ఏర్పాటు చేయడంతో ఇక ముందు సమస్యలు తీరుతాయన్నారు. బోర్డులో ప్రాతిని థ్యం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు మంత్రులు కేటీఆర్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవీరమణాచారి, దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌, బోర్డు ఏర్పాటుకు సహకరించిన పరాశరం రవీంద్రాచారి, గంగు ఉపేంద్ర శర్మ, చింతపట్ల బదరీనాధాచార్యులుకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన బోర్డు మూడేండ్ల పాటు కొనసాగుతుందన్నారు. ఈ వెల్ఫేర్‌ బోర్డులో అర్చక ఉద్యోగుల కుటుంబాల సంక్షేమానికి వివిధ స్కీమ్స్‌, హెల్త్‌ కార్డు గ్రాట్యూటీ పెంపుదల, కాంట్రి బ్యూషనరీ బెనిఫిట్‌ వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చూస్తామన్నారు. దేవదాయ శాఖర్‌, సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ ప్రతిష్ట పెరిగే విధంగా కృషి చేస్తామన్నారు. బోర్డు మొదటి సమావేశం ఈ నెల 16వ తేదీన నవీన్‌ మిట్టల్‌ సమక్షంలో జరుగుతుందని తెలిపారు.