కోమటిరెడ్డిపై ఏఐసీసీ గుర్రు

–  కీలక సమయంలో అనుచిత వ్యాఖ్యలా?
–  ఠాక్రేకు వివరణ… సంతృప్తి చెందని వైనం
–  క్యాడర్‌ మనోధైర్యాన్ని దెబ్బతీశారంటూ ఆగ్రహం
–  కోమటిరెడ్డి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు :మాణిక్‌రావు ఠాక్రే
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పొత్తులకు సంబంధించి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలపై ఏఐసీసీ సీరియస్‌ అయ్యింది. ఇలాంటి వ్యాఖ్యలు క్యాడర్‌ మనోధైర్యాన్ని దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల సమీపిస్తున్న కీలక తరుణంలో పార్టీపై అ సందర్భ వ్యాఖ్యలు చేయడం ద్వారా పార్టీని బలహీనపరచడమేనంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రేకు వివరణ ఇవ్వాలంటూ ఏఐసీసీ ఆదేశించిన నేపథ్యంలో ఆయన భేటీ అయ్యారు. పొత్తులపై తాను ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదంటూ కోమటిరెడ్డి తెలిపారు. ఈమేరకు బుధవారం హైదరాబాద్‌లో బుధవారం ఉదయం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఠాక్రేను కలిశారు. ఇదిలా ఉండగా ఆయన చెప్పిన సమాధానానికి ఆయన సంతృప్తి చెందలేదని తెలిసింది. మరోవైపు కోమటిరెడ్డిపై పార్టీ నేతల విమర్శల పర్వం ఆగలేదు. రేవంత్‌రెడ్డి సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీ గదుల్లో కూర్చొని పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైందికాదని పరోక్షంగా కోమటిరెడ్డిని హెచ్చరించారు. ఠాక్రేను కలిసినంతరం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ భేటీలో తన వ్యాఖ్యలపై చర్చ జరగలేదనీ, తన మాటలను తప్పుగా ప్రచారం చేశారని తెలిపారు. ఎన్నికలకు ఏవిధంగా సిద్ధం కావాలనే అంశాన్ని ఠాక్రేతో చర్చించినట్టు తెలిపారు. ముందస్తుగా టికెట్లు ఇవ్వాలనీ, గెలిచే వాళ్లకు టికెట్‌ ఇవ్వాలని కోరినట్టు వివరించారు.
వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు : ఠాక్రే
పార్టీపై వెంకట్‌రెడ్డి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే తెలిపారు. ఆయన రాహుల్‌గాంధీ ఆదేశాలకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. కాంగ్రెస్‌ నాయకులంతా ఐక్యంగా ఉన్నారనీ, త్వరలోనే పాదయాత్ర చేస్తారని వెల్లడించారు.
హాత్‌ సే హాత్‌ కార్యక్రమంపై ఠాక్రే సమీక్ష
హాత్‌ సే హాత్‌ యాత్రను విజయవంతం చేసేందుకు టీపీసీసీ ఉపాధ్యక్షులతో మాణిక్‌రావు ఠాక్రే సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. హాత్‌ సే హాత్‌ అభియాన్‌ యాత్రను ప్రతి నియోజకవర్గంలో నిర్వహించాలని చెప్పారు.
కాగా ఈ సమావేశానికి 34 మంది ఉపాధ్యక్షులు హాజరు కావాల్సి ఉండగా…కేవలం తొమ్మిది మంది మాత్రమే హాజరయ్యారు. పీసీసీ ఉపాధ్యక్షుల గైర్హాజరుపై ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు గైర్హాజరయ్యారనే దానిపై వివరణ అడగాలంటూ ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మెన్‌ ఏలేటి మహేశ్వర్‌ రెడ్డికి సూచించారు. 17 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పర్యటించి హాత్‌ సే హాత్‌ జోడో యాత్రలో పాల్గొంటానని చెప్పారు. పనితీరు బాగాలేకుంటే పార్లమెంట్‌ ఇంచార్జిలుగా ఉన్న వారిని మార్చాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎవరో చెప్పాలి : నిరంజన్‌
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత కూడా ఇంకా రిటర్నింగ్‌ అధికారిని ఎన్నికల సంఘం ప్రకటించలేదని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు జి నిరంజన్‌ విమర్శించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అభ్యర్థి నేరాల సమాచారం తెలిపేలా నిబంధన ఉందా?అని ప్రశ్నించారు. ఈ విషయాలపై అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.