కలియుగ ద్రౌపది

అది గోకులం, కృష్ణుడి అష్ట భార్యలు ఒకే పొన్నపూల చెట్టు కింద సమావేశమయ్యారు. అందరి మొహంలో ఒకే ఆందోళన కన్పిస్తోంది. తమ హృదయాలను దొంగిలించిన వెన్నదొంగ జాడ గత కొన్ని రోజులుగా కనబడటం లేదు. అందరూ అన్ని విధాలుగా వెతికారు. కాని కృష్ణుడి జాడ కనబడలేదు.
అందరూ సత్యభామ వైపు చూశారు. ఆ చూపులకు అర్థం ఏమిటో సత్యభామకు తెలుసు అందుకే.
”మన నాధుడిని నేను పారిజాతమూ తెమ్మని కోరలేదు” అన్నది.
అందరూ జాంబవతి వైపు చూశారు.
”అక్కా! ఒక్క శమంతకమణి చక్క నా దగ్గర ఏమున్నది? అదీ, నేనూ మన నాథుడి వశమైనాము కదా?” అన్నది జాంబవతి బేలగా.
ఈసారి అందరూ రుక్ష్మిణి వైపు చూశారు!
”చెల్లెమ్మలూ! నేనూ ఏమీ చేయగల స్థితిలో లేను. ఎంత భక్తితో ప్రార్థించినా మన నాథుడి పొడ కానరావటం లేదు!” రుక్ష్మిణి తన నిస్సహాయతను వెల్లడించినది.
అష్టభార్యలు దిగాలు పడ్డారు. వారంతా కృష్ణుడిని వెదుకుతున్నది తమ కోసం కాదు! ఎంతోసేపటి నుండి మహిళల ఆక్రందనలు వినబడుతున్నవి. వారిని కాపాడటానికి తమ నాధుడు వెళ్ళి ఉంటాడని వారి నమ్మకం! కాని ఎంతసేపటికీ ఆక్రందనలు ఆగటం లేదు! తన చెల్లెళ్ళను కృష్ణుడు ఆదుకుంటే ఆక్రందనలు ఆగిపోవాలి! కాని ఆక్రందనలు ఆగిపోవటం లేదు. పైగా పెరుగుతున్నవి. అసలేం జరుగుతున్నదో అర్థం కావటం లేదు.
ఇంతలో నవ్వుతూ, తుళ్ళుతూ ద్రౌపది వచ్చింది. ఆమెను చూడగానే వదినలందరికి ఉత్సాహం వచ్చింది.
”నీవైనా పిలువమ్మా మీ అన్నను పిలవమ్మా! వస్తాడేమో?” అన్నారు అష్టభార్యలు ఏక కంఠంతో.
”ఎందుకు వదినా! ఆడపిల్లలు కష్టంలో ఉండి పిలిస్తే అన్న ఆగలేడు! పిలవగానే వస్తాడు! నా వస్త్రాపహరణం జరుగుతుంటే నన్ను రక్షించింది అన్నే కదా! నన్ను మించిన సాక్ష్యము కావలెనా?” అన్నది ద్రౌపది.
”అందుకే నమ్మా మరోసారి పిలువు!” అన్నారు అష్టభార్యలు.
”అన్నా! నీ చెల్లెలిని పిలుస్తున్నా కాపాడన్నా!” అన్నది ద్రౌపది దీనంగా, కాని లాభం లేదు.
కృష్ణుడి జాడ లేదు.
ద్రౌపది మళ్ళీ మళ్ళీ పిలిచింది. కాని ఫలితం లేదు. కృష్ణుడు రాకపోయినా నారదుడు మాత్రం వచ్చాడు.
”నారాయణ! నారాయణ! ఏమిటి అంతా సమావేశం అయ్యారు! ఏమిటీ విశేషం?” అడిగాడు నారదుడు.
”రండి స్వామీ! దేశంలో ఆడపిల్లల ఆక్రందనలు ఆకాశాన్ని అంటుతున్నాయి! కాని స్వామి వారు మాత్రం వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారో లేదో కూడా తెలియటం లేదు” అన్నారు.
”దీనికి అంత ఆందోళన ఎందుకు తల్లీ!” మీ వద్ద స్వామివారు ప్రసాదించిన ”భవిష్యత్‌ పేటిక” ఉంది కదా! అందులో వెతకండి! స్వామి వారు ఎక్కడున్నారో తెలుస్తుంది!” అన్నాడు నారదుడు.
క్షణాల్లో భవిష్యత్‌ పేటిక వచ్చింది. రుక్ష్మిణీ స్వయంగా పేటిక తెరిచింది. పేటికలోని దృశ్యం చూడగానే ”ఘోరం! ఘోరాతి ఘోరం నేను చూడలేను!” అంటూ కళ్ళు మూసుకుంది.
దాంతో మిగిలిన వారూ పేటికలోని కనబడుతున్న దృశ్యాన్ని చూశారు! వారూ చూడలేక పేటికను మూసివేశారు!
”ముగ్గురు మహిళలను వివస్త్రలను చేసి ఉంది. వీధుల్లో తిప్పుతున్న భయానక దృశ్యం అందులో కనిపిస్తోంది. వారిపై అత్యాచారాలు చేసిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. అది చూసి నారదుడు కూడా తల్లడిల్లిపోయాడు. మెల్లిగా ద్రౌపది వైపుచూశాడు.
ఈసారి తనే కృష్ణ పరమాత్మను స్మరించు పేటికను మళ్ళీ తెరిచాడు. ఈసారి పేటిక తెరపై ఒక పురుషుడు కనబడ్డాడు. ”నా ప్రాణాలకు తెగించి కార్గిల్‌ యుద్ధంలో నా దేశాన్ని కాపాడుకున్నాను. నా త్యాగాలను గొప్పగా చెప్పిన వారు అధికారంలోకి వస్తే ఆనందపడ్డాను. కాని నా భార్యను కాపాడుకోలేకపోయాను” అని ఆ మాజీ సైనికుడు రోదిస్తున్నాడు.
”కృష్ణా ఏమిటి నీ లీల! ఏమిటీ వైపరీత్యం! అన్న పిలవగానే ద్రౌపదికి అండగా నిలిచి, ఆమె శీలాన్ని కాపాడావు! మణిపూర్‌లో నిన్నెవరూ పిలవలేదా! లేక పిలిచినా రాలేదా?” అని ఆక్రోశించాడు నారదుడు.
”నారదా!” అంటూ ఒక ముద్ర స్వరం వినిపించింది అందరూ అటూ ఇటూ చూశారు. అది కృష్ణుడి స్వరమే.
”మీ ఆవేదన నాకర్థమైంది! ద్రౌపదిని కాపాడిన నేను మిగిలిన మహిళలను ఎందుకు కాపాడటం లేదని ఆవేదన చెందుతున్నారు. కాని అది ద్వాపరయుగం, అదేమో కలియుగం, ద్వాపర యుగంలో దుశ్శాసనుడు, కీచకుడూ, ఇలా కొంత మందే ఉన్నారు. ఆనాడు కేవలం కౌరవసభ మాత్రమే గుడ్డివాడి పాలనలో ఉండింది. కాని ఈనాడు భారతదేశమే కళ్ళు ఉండీ చూడలేని ధృతరాష్ట్రుల పాలనలో మగ్గుతున్నది. ఈ అత్యాచారం గురించి మాట్లాడలేని మూగవారి పాలన కొనసాగుతున్నది. కలియుగంలో ప్రజాస్వామ్యం అత్యంత శక్తివంతం! కాని ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవలసింది ప్రజలే! భావోద్వేగాలకు, రాగద్వేషాలకు ప్రజలు లోనైతే వచ్చేది దృతరాష్ట్రుల పాలనే! దీనికి ప్రజలే సరైన సమాధానం చెబుతారు! నేను నిమిత్త మాత్రుడిని!” అంటూ పేటిక మూతపడింది.