కులవృత్తుల ఆర్థిక పథకానికి నిధులు విడుదల చేయాలి : పైళ్ళ ఆశయ్య

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కుల వృత్తుల ఆర్థిక పథకానికి వెంటనే నిధులు విడుదల చేయాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రజకవృత్తిదారుల సంఘం అధ్యక్షులు జి నరేశ్‌ అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్ష రూపాయల ఆర్థిక పథకంలో ప్రజా ప్రతినిధుల జోక్యంతో అవినీతి పెరిగిందని తెలిపారు. అర్హత కలిగిన వత్తిదారులందరికీ పారదర్శకంగా ఆర్థిక సహకారం అందించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ప్రచారం చేసుకోవటంలో ఉన్న ఆసక్తి.. వృత్తిదారులకు పథకాన్ని చేరువ చేయటం లేదని విమర్శించారు. అర్హులందరికీ లక్ష సాయాన్ని అందించక పోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం బాలకృష్ణ, సి మల్లేష్‌, జ్యోతి ఉపేందర్‌, రాష్ట్ర సహాయ కార్యదర్శులు అన్నారపు వెంకటేశ్వర్లు, ఎదునూరి మదార్‌, పాయిరాల రాములు, కోట్లు నవీన్‌ కూమార్‌ తదితరులు పాల్గొన్నారు.