‘ఎమ్మెల్సీ’ ఫైట్‌..

–  హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక
–  29,591 ఓటర్ల గుర్తింపు
–  టీఎస్‌ యూటీఎఫ్‌, పీఆర్టీయూ మధ్యే ప్రధాన పోటీ
–  ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలి : మాణిక్‌రెడ్డి
– ఉద్యమ నాయకుడు మాణిక్‌రెడ్డిని గెలిపించండి : టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య
నవతెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
మరో ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఓటర్‌ లిస్టును తయారు చేసి ఎన్నికల నియమావళిని ప్రకటించగా.. గురువారం ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్నికల్లో 29,591 ఓటర్లు ఓటు హక్కు వినియోగించు కోనున్నారు. విద్యారంగాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతో టీఎస్‌ యూటీఎఫ్‌ నుంచి మాణిక్‌రెడ్డి పోటీలో ఉండగా.. పీఆర్టీయూ, మరికొన్ని ఇతర ఉపాధ్యాయ సంఘాలు సైతం ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి. ప్రజాసంస్థలను కాపాడుకోవాలని ఉద్యమాలు చేసే సంఘం యూటీఎఫ్‌ సంఘమని నాయకులు తెలిపారు.
హైదరాబాద్‌- రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచి ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికకు సంబంధించి గురువారం నోటిఫికేషన్‌ రానుండటంతో ప్రచారం తారాస్థాయికి చేరుకున్నది. ఉమ్మడి మూడు జిల్లాల పరిధిలో 29,501 ఓటర్లు ఉన్నారు. ప్రతి మండలానికీ ఒక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.మార్చి 13న నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రధాన ఉపాధ్యాయ సంఘాల నాయకులు చాలా రోజుల నుంచి ప్రచారాన్ని చేస్తున్నారు. టీఎస్‌ యూటీఎఫ్‌ నుంచి మాణిక్‌రెడ్డి, పీఆర్‌టీయూ నుంచి చెన్నకేశవరెడ్డి ప్రచారంలో ఉన్నారు. ఎస్టీయూ నుంచి భుజంగరావు, తాజాగా కొనసాగుతున్న కాటేపల్లి జనార్దన్‌ రెడ్డి సైతం తలపడనున్నారు. ఇంకా హర్షవర్ధన్‌రెడ్డి. మరికొంత మంది పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. చివరి నిమిషంలో బీజేపీ తన అభ్యర్థిగా వెంకట నారాయణరెడ్డిని ప్రకటించింది. ఎంతమంది పోటీ చేసినా టీఎస్‌ యూటీఎఫ్‌, పీఆర్‌టీయూ మధ్యనే ప్రధాన పోటీ ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిచిన నాయకులు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, విద్యారంగం బలోపేతం కోసం కృషి చేయనున్నారు. ఇప్పటికే యూటీఎఫ్‌ నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న నర్సిరెడ్డి విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఆయనకు తోడుగా మాణిక్‌రెడ్డిని శాసన మండలికి పంపిస్తే.. విద్యారంగానికి విశేష సేవలు అందించే అవకాశాలుం టాయని ఉపాధ్యాయ నాయకులు తెలిపారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలని మాణిక్‌రెడ్డి కోరారు.
విద్యారంగ పరిరక్షణకు కృషి: టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య
ఉపాధ్యాయ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్సీలు విద్యారంగ పరిరక్షణ కోసం కృషి చేయాలి. ముఖ్యంగా బడ్జెట్లో అధిక నిధులు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. విద్యారంగానికి కేరళ తరహాలో బడ్జెట్లో నిధులు అధికంగా కేటాయించాల్సి ఉంది. ముఖ్యంగా కార్పొరేట్‌ శక్తుల కబంధహస్తాల్లో విద్యార్థిలోకం విలవిల్లాడుతోంది. లక్షల్లో ఫీజులు చెల్లించలేని దుస్థితిలో విద్యార్థులు ఉన్నారు. ఎమ్మెల్సీగా గెలిచిన నాయకులు కౌన్సిల్‌ సమావేశంలో విద్యారంగానికి అధిక నిధులు వచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. మార్చిలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యమ నేపథ్యం కలిగిన మాణిక్‌రెడ్డిని అత్యధిక ఓట్లతో గెలిపించి విద్యారంగ పరిరక్షణకు సహకరించాలని పలువురు మేధావులు, ఉపాధ్యాయులు కోరారు.