మణిపూర్‌ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి

– మారణహౌమం జరుగుతుంటే.. కేంద్రం ఏం చేస్తుంది : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి. సాగర్‌
– రాష్ట్రవ్యాప్తంగా పలు పజాసంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో నిరసనలు
నవతెలంగాణ – విలేకరులు
మణిపూర్‌లోని కాంగ్‌ఫోక్సీ జిల్లాలో కుకీ తెగకు చెందిన ఇద్దరు ఆదివాసీ మహిళలను నగంగా ఊరేగిస్తున్నా చూసీచూడనట్టు వ్యవహరించడమే కాక, మూడు నెలలుగా రాష్ట్రంలో మరణహౌమం జరుగుతున్నా స్పందించని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి. సాగర్‌ డిమాండ్‌ చేశారు. మణిపూర్‌లో మూడు నెలలుగా భయానక మారణ హౌమం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఆదివారం నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దాచ లక్ష్మి ఫంక్షన్‌ హాల్‌ నుంచి వివేకానంద చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పాల్గొన్న టి.సాగర్‌ మాట్లాడుతూ.. మణిపూర్‌లో మహిళలపై సాగుతున్న అఘాయిత్యాలు వెలుగులోకి వస్తున్నా.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాని, ప్రధాని మోడీ కాని దీనిపై మాట్లాడకపోవడం దారుణమన్నారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకుంటామని సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించడంతో.. ప్రధాని మొసలి కన్నీరు కారుస్తూ నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటనలు గుప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ మహిళగా ఉన్న రాష్ట్రపతి కూడా ఏ మాత్రం స్పందించకపోవడం బాధకరమని అన్నారు. దుండగులను కఠినంగా శిక్షించాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలో టీఎస్‌ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు ఉపాధ్యాయులతో ర్యాలీ నిర్వహించారు.
హైదరాబాద్‌ హిమాయత్‌ నగర్‌లోని అమృత ఎస్టేట్‌ నుంచి ‘వై’ జంక్షన్‌ వరకు.. సీపీఐ ఆధ్వర్యంలో గిరిజన సంఘం, మహిళా సమాఖ్య, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, దళిత హక్కుల పోరాట సమితి, విద్యార్థి ఫెడరేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర నాయకులు పశ్య పద్మ మాట్లాడుతూ.. ఆదివాసీ మహిళల నగ ప్రదర్శన, వారిపై లైంగికదాడులు, హత్యలు జరుగుతున్నా నియంత్రించలేని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ యునైటెడ్‌ క్రిస్టియన్స్‌ అండ్‌ ఫాస్టర్స్‌ అసోసియేషన్‌, ట్విన్‌ సిటీస్‌ ఫాస్టర్స్‌ ఫెలోషిప్స్‌ ఆధ్వర్యంలో వందలాది మంది క్రైస్తవులు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహం ఎదుట పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ.పాల్‌ మాట్లాడుతూ.. మణిపూర్‌లో జరిగిన సంఘటనలను చూసి ప్రపంచమంతా నివ్వెరపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లా కేంద్రంలోని జెడ్పీ సెంటర్‌లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఖమ్మం రూరల్‌ మండలం ఎం.వెంకటాయపాలెం గ్రామంలో కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఐద్వా ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. తిప్పర్తి మండల కేంద్రంలో సీపీఐ(ఎం), ఐద్వా, సీఐటీయూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీఎస్‌ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో స్థానిక వాణిజ్య భవన్‌సెంటర్‌లో నిరసనర్యాలీ చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం సింగన్నగూడెం చౌరస్తాలో ఐద్వా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సంస్థాన్‌నారాయ ణపురం మండలంలోని అల్లందేవి చెర్వు గ్రామంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఆలేరు పట్టణంలో ప్రగతిశీల మహిళాసంఘం, పీవైఎల్‌ ఆధ్వర్యంలో రైల్వేగేట్‌ సెంటర్‌లో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. భువనగిరి మండలంలోని ఆకుతోట బావితండాలో ఆలిండియా బంజారా సేవా సంఫ్‌ు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.