– జీవో నెంబర్ 46ను రద్దు చేయాలంటూ డిమాండ్
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ క్వాలిఫైడ్ కానిస్టేబుళ్లు పలువురు సోమవారం డీజీపీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రద్దీ ప్రదేశమైన డీజీపీ కార్యాలయం ఎదుట అనేక మంది క్వాలిఫైడ్ కానిస్టేబుళ్లు ఒక్కసారిగా వచ్చి ధర్నాకు కూర్చోవటంతో లక్డీకాఫూల్ ప్రాంతంలో తీవ్రమైన ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన క్వాలిఫైడ్ కానిస్టేబుళ్లు ఈ సదర్భంగా జీవో 46ను రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ జీవో కారణంగా తమకు అన్యాయం జరుగుతోందనీ, తాము మెరిట్‌ను సాధించినప్పటికీ ఈ జీవో నెంబర్ 46 పరిధిలోకి వచ్చే అభ్యర్థులకు మేలు జరుగుతున్నదని వారు ఆరోపించారు. జీవోను వెంటనే రద్దు చేసి తమకు న్యాయం చేకూర్చాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. వీరి ధర్నా కారణంగా ఆ ప్రాంతంలో తీవ్రమైన ట్రాఫిక్‌జామ్ ఏర్పడటంతో వెంటనే రంగంలోకి దిగిన సైఫాబాద్ పోలీసులు ధర్నా చేస్తున్న క్వాలిఫైడ్ కానిస్టేబుళ్లను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.