విమల రణదీవే పోరాట పటిమ అమోఘం

– ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి :
– సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ.రమ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కార్మికుల హక్కుల కోసం విమల రణదీవే ప్రదర్శించిన పోరాట పటిమ అమోఘమని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ. రమ కొనియాడారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు అధ్యక్షతన కార్మికోద్యమ నేత విమల రణదీవే 24వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె చిత్రపటానికి ఆ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, చుక్క రాములు, ఎస్వీ.రమ, సీనియర్‌ నాయకులు పి.రాజారావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రమ మాట్లాడుతూ..పన్నెండేండ్ల వయస్సులో విమల ఉద్యమ ప్రస్తానం మొదలైందని చెప్పారు. 1930లో శాసనోల్లంఘన ఉద్యమంలో, విదేశీ వస్త్ర దుకాణం ముందు పికెటింగ్‌ చేస్తున్న ఆమె బ్రిటీష్‌ పోలీసులు అరెస్టు చేశారనీ, ఆమెకు ఆరు నెలల పాటు కఠిన కారాగార శిక్ష విధించిందని వివరించారు. బొంబాయి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రేడ్‌ యూనియన్‌ విస్తరణ కోసం పనిచేశారన్నారు. 1940లో గిర్ని కమ్‌గర్‌ యూనియన్‌లో కార్మికుల సాధారణ సమ్మెలో ఆమె క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఆమె ప్లాంటేషన్‌ రంగంలో పని చేసి, సీఐటీయూ ప్లాంటేషన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఏర్పడినప్పుడు మొదట ప్రధాన కార్యదర్శిగా, తర్వాత అధ్యక్షులుగా పని చేశారని తెలిపారు. ఆమె ఆల్‌ ఇండియా కోఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ వర్కింగ్‌ ఉమెన్‌ ఆవిర్భావ సభలో కన్వీనర్‌గా, 1989లో అంగన్‌వాడీ వర్కర్స్‌ ఫెడరేషన్‌ గౌరవాధ్యక్షురాలుగా ఎన్నికయ్యారని చెప్పారు. దేశ వ్యాప్తంగా శ్రామిక మహిళల హక్కుల కోసం ఆమె నిరంతరం కృషి చేశారని కొనియాడారు. సీఐటీయూ పత్రిక వాయిస్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఉమెన్‌, హిందీలో కామ్‌కాజీ మహిళ పత్రికకు కూడా ఎడిటర్‌గా పని చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఆఫీస్‌ బేరర్లు ఎస్‌.వీరయ్య, జె.వెంకటేష్‌, భూపాల్‌, టి.వీరారెడ్డి, బి.మధు, జె.మల్లికార్జున్‌, జె.చంద్రశేఖర్‌, బి.మల్లేష్‌, ఎం.వెంకటేశ్‌, కె.ఈశ్వరావులతో పాటు వివిధ జిల్లాల నుండి వర్కింగ్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.