బయటి ప్రపంచం ఎలా ఉంటుందో తెలియకుండా పెరిగిన ఓ సాధారణ అమ్మాయి. అలాంటిది కవిత్వం, కథ, నవల, వ్యాసం, అనువాదం, సమీక్ష, విమర్శనా వ్యాసాలు ఇలా ఒక్కటి కాదు దాదాపుగా తెలుగు సాహిత్యంలో ఉన్న ప్రక్రియలన్నిటిలో ఆమెకు ప్రవేశం ఉంది. 800 గ్రంథాలకు సమీక్షలు చేశారు. 12 గ్రంథాలు తెలుగు నుండి ఆంగ్లంలోకి అనువదించారు. పది కవితా సంపుటాలు, మూడు కథా సంపుటాలు, మూడు నవలలు రాశారు. ఆమే ప్రముఖ రచయిత్రి శైలజా మిత్ర. సాహిత్యానికి తాను చేసిన సేవకు గుర్తుగా తెలుగు యూనివర్సిటీ నుండి కీర్తి పురస్కారం సైతం అందుకున్న ఆమె పరిచయం ఆమె మాటల్లోనే…
చిత్తూరు జిల్లాలోని, చిన్నగొట్టిగల్లు గ్రామంలో పుట్టాను. మాది మధ్యతరగతి కుటుంబం. అమ్మ తెలికిచెర్ల అనసూయాదేవి, గృహిణి. మా నాన్న తెలికిచెర్ల శేషగిరిరావు (రిటైర్డ్ మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్). వీరికి మేము ఆరుగురు సంతానం. నాకు ముగ్గురు అన్నయ్యలు, ఒక అక్క, ఒక చెల్లి. నేను ఐదవదాన్ని. మేము ఏం తిన్నామో ఏమో గుర్తులేదు కానీ క్రమశిక్షణ నరనరాన ప్రవహించేలా ఉండేది మా ఇంటి వాతావరణం. ఏది జరిగినా టైమ్ ప్రకారం జరగాలనేదే మా నాన్న ఆశయం. ఒక్క మాట బయటకి వినిపించకూడదు. శబ్ధం వచ్చేలా నవ్వకూడదు. అలా కాదని ఏమి జరిగినా కఠిన శిక్షలు అమలు చేసేవారు. చదువు తప్ప మరో మాట వినిపించేది కాదు. ఎన్ని మార్కులు? అనేదే కొలమానం. అలాంటి ఇంట్లో పెరిగిన నేను. స్కూల్లో పాడటం తప్ప మాట్లాడటమే తెలియదు. ఇలా స్వతంత్ర భావమంటే ఏంటో తెలియని వాతావరణంలో పెరిగాను. ఇంత చేసినా నాకు అమ్మకన్నా నాన్నంటే ఎంతో ఇష్టం, గౌరవం. ఉన్నతంగా జీవించడం అంటే డబ్బు సంపా దించడం కాదు. ఔన్యత్యంతో జీవించడం అని చెప్పే నాన్న మాటలు నన్ను ఎప్పుడూ వెంటాడుతుండేవి. జీవితమంటేనే తెలియని ఆ రోజులు తలుచుకుంటుంటే సంతోషంగా ఉంటుంది అంటే అవే బావున్నాయి కదానిపి స్తుంటుంది.
గాత్రం మూగబోవడంతో…
చిన్నతనం నుండీ కర్నాటక సంగీత మంటే ప్రాణం. స్కూలు, కాలేజీ రోజుల్లో ప్రతి కార్యక్రమంలో పాల్గొనేదాన్ని. పాటలే నా ప్రపంచంగా బతికేదాన్ని. డిగ్రీ వరకు పూర్తి చేశారు. పెండ్లి తర్వాత 1987లో హైదరాబాద్‌లో అడుగు పెట్టాను. తర్వాత దాదాపు పదేండ్ల పాటు పిల్లలు, వారి సంరక్షణ, కుటుంబ బాధ్యతలతో సాహిత్యం, సంగీతం అనే మాటలు మరచిపోయాను. కొన్ని అనారోగ్య కారణాల వల్ల నా గాత్రం మూగపోవడంతో పాడలేకపోయా. దాంతో చాలా కుంగిపోయా. అయితే నేను అప్పటి వరకు పాడిన పాటలు చాలా వరకు నేను రాసినవే కావడంతో నాలో సాహిత్యం కూడా ఉందని గుర్తించి కొందరు పెద్దలు ప్రోత్సహించారు. అపుడప్పుడూ కవితలు రాస్తూ ఆంధ్రభూమికి పంపుతుండేదాన్ని. డిగ్రీ పూర్తి చేసినా సరైన ఉద్యోగం కూడా చేయలేకపోయాను.
సాహిత్యానికీ ఓ ప్రపంచం
1996లో మా నాన్న చనిపోయారు. అప్పుడు అమ్మ నాతోనే ఉంది. అమ్మను పరామర్శించడానికి వచ్చిన ఒక దూరపు బంధువు డా|| పోతుకూచి సాంబశివరావు మా ఇంటికి వచ్చారు. మాటల సందర్భంలో అమ్మ నా కవితల గురించి చెప్పింది. వాటిని చూసి ‘నీకు సాహిత్యంలో మంచి భవిష్యత్ ఉంది’ అని ప్రోత్సహించి వారి సభలకు ఆహ్వానించేవారు. సాహిత్యానికి కూడా ఒక ప్రపంచం ఉందని అప్పుడే నాకు అర్థమయింది. అప్పటి నుండి ఆ సభల్లో చాలా యాక్టివ్‌గా పని చేయడం మొదలుపెట్టాను. అలాగే నా రచనలు కూడా పెరిగాయి.
సాహితీ పెద్దల ప్రోత్సాహం
1997లో నా తొలి కవితా సంపుటి ‘శంఖారావం’ ప్రచురించాను. అది డా||సి.నారాయణరెడ్డి ఆవిష్కరించడంతో నా జీవితంలో సాహితీ దీపం వెలిగింది. ‘నీ కవిత్వంలో జీవం ఉంది. నువ్వు నిలబడ గలవు. అయితే కవిత్వానికి కృషి అక్కర్లేదు. వాస్తవం ఉంటే చాలు. కష్టపడి రాసేది కవిత్వం కాదు. ఇష్టపడి రాస్తేనే అది కవిత్వం అవుతుంది’ అని అప్పుడు ఆయన అన్న మాటలు నాకంతగా అర్థం కాలేదు. గుంటూరు శేషేంద్ర శర్మకు నా రచన పంపాను. వారు పంపిన కార్డులో ‘నీ కవిత్వం పరిమళ భరిత కాంతి బింబం, కొనసాగించు ఆశీస్సులతో’ అని పంపారు. ఇలా సాహితీ పెద్దల ప్రోత్సాహంతో నాపై నాకు నమ్మకం వచ్చింది. బయటి ప్రపంచంలోకి వెళ్ళే కొద్ది చాలా విషయాలు తెలుసుకున్నాను. సాహితీ ప్రపంచంలో మనల్ని మనం కాపాడుకోవడం కూడా చాలా అవసరమని గుర్తించాను. అప్పటి నుండి ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయడానికే ప్రయత్నించాను.
నవలలు ధారావాహికలుగా
నేను ఇష్టంగా రచించిన కవితా సంపుటి ‘అంతర్మథనవేళ’. ఈ గ్రంథానికి శ్రీశ్రీ ఉత్తమ కవితా పురస్కారం అందుకున్నాను. ఆ తర్వాత రచించిన కవితా సంపుటి ‘రాతి చిగుళ్ళు’. దీనికీ మంచి గుర్తింపు వచ్చింది. ఆరుద్ర సాహితీ పురస్కారం, ఉమ్మడి శెట్టి కవితా పురస్కారం గెలుచుకుంది. ‘అడ్డా’ కథా సంపుటికి రమ్యసాహితీ, పెనుగొండ వారి ఉత్తమ కథా రచయిత్రిగా పురస్కారం అందుకున్నాను. ఇవే కాకుండా మూడు నవలలు రచించాను. మొదటిది ‘ఏనావది ఏ తీరమో” ఆంధ్రభూమిలో ఉగాది నవలల పోటీలో సాధారణ బహుమతికి ఎంపికై అందులోనే ధారావాహికంగా ప్రచురింపబడింది. అయితే ఒక గ్రంథంగా రూపుదిద్దుకోలేదు. అందుకే సోషియల్ మీడియాలో అందరూ చదివేలా ఏర్పాటు చేసాను. రెండవ నవల ‘ఆకుపచ్చని జాబిలి’ చిత్ర మాసపత్రికలో ప్రచురింపబడింది. మూడవ నవల ‘నేలమీది నక్షత్రాలు’ పొయట్రీ.కామ్ అనే వెబ్‌సైట్‌లో ధారావాహికంగా ప్రచురించబడింది. అలాగే దాదాపు 600 గ్రంథాల వరకు సమీక్ష, విమర్శ చేసేందుకు ‘నేటినిజం’ అవకాశం కల్పించింది. ఇవే కాకుండా దాదాపు వంద సమీక్షల వరకు వివిధ పత్రికల్లో వచ్చాయి.
కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని
కవిత్వం, కథలతో పాటు నవలలు, వ్యాసాలు, సమీక్షలు, విమర్శనా వ్యాసాలు, ఇంటర్వ్యూలు వరుసగా రచనలు చేసాను. ఆంగ్లంపై కాస్తంత పట్టు ఏర్పడటంతో ‘సిల్వర్ లైన్స్’ అనే ఆంగ్ల కవితా సంపుటిని ప్రచురించాను. తర్వాత అనువాదంపై ఆసక్తి కలిగి నా సొంత రచనలతో పాటు దాదాపు 12 మంది రచనలు తెలుగు నుండి ఆంగ్లంలోకి అనువాదం చేసాను. అయితే అనువాదం చేసిన తర్వాత ఆర్థిక విషయంలో, గుర్తింపు విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. వారికి గట్టిగా సమాధానం చెప్పే ధైర్యం లేక అనువాదాలు చేయడమే మానేశాను.
ఒక ఉనికి అవసరం
వ్యక్తిత్వం కోల్పోతే మనిషి బతికున్నా చని పోయినట్లే. అందుకే జీవితం ఒకరి చెప్పు చేతల్లో ఎందుకుండాలి? అనిపించేది. స్త్రీ కావచ్చు, పరుషుడు కావచ్చు ఎవరికైనా ఒక ఉనికి అవసరం. అది వారికున్న ప్రతిభ ఆధారంగానే వస్తుంది. సంగీతం, సాహిత్యం, నృత్యం, ఎంబ్రాయిడరీ, అల్లి కలు వంటివన్నీ నాకు నచ్చిన, వచ్చిన ప్రతిభలే. కాకుంటే కాలానుగుణంగా కొన్ని వాటంతట అవే మరు గున పడిపోతాయనేది నా విషయంలోనే నిజమ య్యింది. సాహిత్యం ఒక్కటే ఇప్పటి వరకు నాకు తోడుగా నిలిచింది. సాహిత్య పరంగా ఎన్నో పురస్కారాలు, సత్కారాలు అందుకున్నాను. అన్నింటికి మించి నా రచనలకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు నిచ్చించి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారి నుండి అందుకున్న కీర్తి పురస్కారం. అలాగే ఉత్తమ విమర్శకురాలిగా అమృతలత ద్వారా నాకు అందించిన అపురూప అవార్డు నా సాహితీ ప్రమాణాన్ని పెంచాయనే చెప్పాలి. ప్రతి పురస్కారం సమాజం పట్ల మరింత బాధ్యత పెంచేదిగానే భావిస్తాను.
పెండ్లి తర్వాత స్వేచ్ఛ దొరికింది
పెండ్లి తర్వాత ఓ కొత్త వాతావరణం దొరికింది. అక్కడ ఎంత మాట్లాడినా ఏమీ అనరు. ఎంత నవ్వినా ఎందుకని ప్రశ్నించరని తెలిసి నా ఆనందానికి అవధుల్లేవు. అయితే ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? అనే విషయం లో ఎన్నో సమస్యలు ఎదు ర్కున్నా. అదొక వింత అనుభూతి. అయితే స్వేచ్ఛ దొరికింది. మా అత్తయ్య సుశీలమ్మ అమ్మను మించి చూసుకునేవారు. ఆడపడుచులు స్నేహితుల్లా కలిసిపోయారు. కుటుంబంలో ఆర్థిక సమస్యలున్నా నన్ను ఒక్క మాట అనేవారు కాదు. నా భర్త స్నేహితుడిలా నా మాటకు విలువిచ్చేవారు. ఎదిగిన తర్వాత నా పిల్లలు కూడా నాకెంతో సహకరించారు. కొన్ని ఇబ్బందులు వచ్చినా సంతోషంగానే జీవించాను. పెండ్లి తర్వాతే ఎంఏ తెలుగు, రచన జర్నలిజం కాలేజీలో పిజిడిసిజె చదువుకున్నాను.
– సలీమ