– కేంద్రాన్ని వెంటాడి, వేటాడుతాం..
– మణిపూర్ అంశంపై చర్చ జరపకుండా పారిపోతోంది : బీఆర్‌ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తొమ్మిదేండ్ల పాలనలో అన్నింటా విఫలమై దేశాన్ని భ్రష్టు పట్టించిన కేంద్ర సర్కార్‌ను వదిలే ప్రసక్తే లేదు.. వెంటాడి,వేటాడుతామని బీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. బుధవారం కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అంశంతో సహా అనేక కీలక అంశాలపై పార్లమెంట్లో చర్చించకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న కేంద్రం తీరుకు నిరసనగా బీఆర్‌ఎస్ అవిశ్వాస తీర్మానం నోటీస్‌ను ఇచ్చిందని చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక కీలక అంశాలపై చర్చించాలని పార్లమెంట్ ప్రారంభమైన నాటి నుంచి తమ పార్టీ తరుఫున వాయిదా తీర్మానాలు ఇస్తూనే ఉన్నా కేంద్రం మొండిగా వెనక్కిపోతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీరు తీవ్ర ఆక్షేపణీయమన్నారు. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో హింసాత్మక ఘటనలతో అక్కడి ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని, బతుకుతున్నారని వాపోయారు. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ చెలరేగిన హింస వల్ల శాంతి భద్రతలు క్షీణించి, నరమేధం జురుగుతోందనీ, అయినా కేంద్రానికి పట్టకపోవడం దారుణమని విమర్శించారు. ఆయా ఘటనలపై పార్లమెంట్‌లో చర్చించాలని పదే పదే బీఆర్‌ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చినా చర్చకు అనుమతిమించకుండా ఎన్డీయే ప్రభుత్వం నిర్లక్ష్యంగా, మొండిగా వ్యవహరిస్తూ తప్పించుకుంటోందని అన్నారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు 19న జరిగిన పార్లమెంటరీ పార్టీ నాయకుల సమావేశంలో కూడా మణిపూర్ అంశంతో సహా అనేక కీలక అంశాలపై పూర్తి స్థాయిలో చర్చించాలంటూ కోరామని గుర్తుచేశారు.