జై భారతి… ఓ బైక్ రైడర్. 2019లో 17,000 కి.మీ యాత్రలో నలుగురు మహిళా రైడర్లతో కూడిన ఉద్వేగభరితమైన సమూహంలో భాగమయింది. బైక్ రైడింగ్ మహిళల జీవితాలను ఎంతగా మారుస్తుందో అప్పుడే ఆమె గుర్తించింది. ఈ యాత్ర భారతదేశం, బంగ్లాదేశ్, మయన్మార్, కంబోడియా లావోస్, వియత్నాంల మీదుగా థారులాండ్లోకి ప్రవేశించింది. అక్కడ ఆమె 40-50 ఏండ్ల మధ్య వయసు గల మహిళలు బైక్, టాక్సీ డ్రైవర్లుగా రోడ్లపై వేచి ఉండటం చూసింది. ఆ దృశ్యం ఆమెలో ఆశ్చర్యంతో పాటు ఓ ఆలోచనకు పునాది వేసింది. అదే హైదరాబాద్‌లో ‘మూవింగ్ ఉమెన్’గా ఆవిర్భవించింది. దీని ఆధ్వర్యంలో ఎంతో మంది మహిళలను రైడర్లుగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే వారికి డ్రైవింగ్ నేర్పిస్తూ జీవనోపాధి చూపిస్తున్నారు. ఆ వివరాలేంటో మనమూ తెలుసుకుందాం…
హైదరాబాద్‌కు చెందిన భారతి వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్. అయితే బైక్ రైడింగ్ అంటే ప్రాణం. కాలేజీ రోజుల్లో ఆమె సరదాగా రైడింగ్ ప్రారంభించారు. గత పదేండ్లలో ఆగేయాసియా, యుఎస్‌లో లక్ష కిలోమీటర్లు ప్రయాణించారు. రోడ్ టు మెకాంగ్ యాత్రలో ఆమె రైడింగ్ చేస్తున్న మహిళలను ఎక్కువగా చూశారు. ఇక థాయిలాండ్, కంబోడియా, వియత్నాం వంటి దేశాల్లో ఇది సర్వసాధారణంగా కనిపించింది. కానీ భారతీయ రహదారులపై లింగ అసమతుల్యత స్పష్టంగా ఉంది. భద్రతా సమస్యలు కూడా ఉన్నాయి. ”డ్రైవింగ్‌లో లింగ సమానత్వం సాధించేందుకు ఏకైక మార్గం మహిళలకు డ్రైవింగ్ నేర్పించడం. దీని ద్వారా మనం ఎలాంటి సామాజిక ప్రభావాన్ని సృష్టించగలమో చూడడానికే మూవింగ్ ఉమెన్(వీఉఔఉ) ప్రారంభించాను” అని ఆమె అంటున్నారు.
డ్రైవింగ్ ఓ నైపుణ్యం
2019లో ఒక మహిళతో ప్రారంభమైన వీఉఔఉ శిక్షణ 2030 నాటికి పది లక్షల మంది మహిళలకు చేరుకోవాలనే లక్ష్యంతో భారతి దీన్ని ప్రారంభించారు. దిగువ మధ్య తరగతి మహిళలకు కనీసం టూ వీలర్ నడపడంలో కూడా ప్రవేశం లేదు. అందుకే అలాంటి మహిళలకు డ్రైవింగ్ కచ్చితంగా నేర్పించాలని భావించారు. ”ప్రస్తుత కాలంలో డ్రైవింగ్ నేర్చుకోవడం మహిళలకు చాలా అవసరం. అయితే వారిని డ్రైవింగ్ నేర్చుకునేలా ప్రోత్సహించడానికి వారి భర్తలు, పిల్లలకు కూడా అవగాహన కల్పించాల్సి వచ్చింది. డ్రైవింగ్ అనేది ఒక నైపుణ్యం. డ్రైవింగ్ వస్తే ఒక స్త్రీ తనకు కావలసినది చేసుకోగలదు. సొంత వ్యాపారం చేసుకోవచ్చు, పిల్లలను పాఠశాలకు పంపొచ్చు, జీవనోపాధి పొందవచ్చు. అలాంటి నైపుణ్యాన్ని ఆమెకు ఇవ్వడం చాలా ముఖ్యం” అంటున్నారు ఆమె.
శ్రామికశక్తిలో భాగమవుతారు
భారతదేశం అంతటా 20 నగరాలను కవర్ చేస్తూ 2021లో మూవింగ్ బౌండరీస్ యాత్ర చేసి ఆమె మహిళల్లో మరింత అవగాహన పెంచగలిగారు. ఓ వాట్సాప్ గ్రూపు కూడా క్రియేట్ చేశారు. మహిళలకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వ సంస్థలతో పాటు ఇతర సంస్థలతో కూడా మాట్లాడారు. ”చాలా మంది స్త్రీలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ సమస్య ఏమిటంటే వారికి నేర్పించడానికి ఎవరూ లేరు. వీరు డ్రైవింగ్ నేర్చుకోగలిగితే రవాణా రంగ శ్రామికశక్తిలో పురుషులతో సమానంగా మహిళలు కూడా ఉంటారు” అంటున్నారు ఆమె. ఇకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లతో భాగస్వాములు కావాలంటే నైపుణ్యంతో పాటు డాక్యుమెంటేషన్ కూడా అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకుని వీఉఔఉ సోషల్ వాట్సాప్ గ్రూప్‌ను రూపొందించింది. ఇది డ్రైవర్లుగా పని చేయడానికి 2,000 మంది మహిళలను తయారు చేసింది.
దేశం మొదటి శిక్షణా కేంద్రం
ఈ సంస్థ ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 2,500 మంది మహిళలకు టూవీలర్ డ్రైవింగ్, 200 మందికి పైగా ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు నడపడంలో శిక్షణ ఇచ్చింది. ఆసక్తి ఉన్నవారికి కార్ డ్రైవింగ్‌లో కూడా శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ కోసం మహిళా, శిశు సంక్షేమ శాఖ వారి మోటార్ శిక్షణా కేంద్రాన్ని ఉపయోగిస్తున్నారు. భారతదేశంలోనే మహిళల కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి మోటారు శిక్షణా కేంద్రం ఇది. ”మహిళలు ఇక్కడికి వచ్చేందుకు ఇష్టపడతారు. ఎందుకంటే వారు నేర్చుకోవడానికి సురక్షితమైన వాతావరణం మా వద్ద ఉంటుంది” అని భారతి అంటున్నారు. శిక్షణా కేంద్రం ప్రభుత్వ డిపార్ట్మెంట్లో ఉండడంతో ఇతర నైపుణ్యాలు నేర్చుకోవడానికి వచ్చే మహిళలందరూ మోటారు శిక్షణా కార్యక్రమంలో కూడా భాగం అవుతున్నారు. శిక్షణ కూడా ఉచితం. అయితే వీఉఔఉ సోషల్ లైసెన్స్ దరఖాస్తు చేసుకోవడంలో సహకరిస్తుంది.
ఉపాధి పొందడం ముఖ్యం
ఈ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో కూడా శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తుంది. హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీ క్యాంపస్‌లో 150 మంది మహిళా సిబ్బందికి శిక్షణా శిబిరాలను నిర్వహించింది. ఢిల్లీలో జీఎంఆర్ ఫౌండేషన,్ జుుఉ మోటార్స్ భాగస్వామ్యంతో శిక్షణను నిర్వహిస్తుంది. ఇక్కడ మహిళలు జుV ఆటోలను నడపడంలో శిక్షణ ఇస్తారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా భాగస్వాములై ప్రభుత్వ భవనాల్లోనే కేంద్రాలను నిర్మించాలని, తద్వారా ఎక్కువ మంది మహిళలు శిక్షణ పొందేలా చూడాలని భారతి యోచిస్తున్నారు. ”శిక్షణ తర్వాత మహిళలు ఉపాధి పొందడం మాకు ముఖ్యం. అయితే చాలా మంది ఒక అడుగు ముందుకేసి వివిధ ప్లాట్‌ఫారమ్‌లతో కలిసి పని చేస్తున్నారు” అని భారతి అంటున్నారు
మహిళలను శక్తివంతం చేసేందుకు
”ఉత్తర థారులాండ్‌లో టాక్సీ, ఫుడ్ డెలివరీ డ్రైవర్లుగా పని చేస్తున్న మహిళలను చూసి ఆశ్చర్యపోయాను. ప్రపంచవ్యాప్త నా ప్రయాణాలలో చాలా మంది మహిళలను చూశాను. కానీ ఈ సంఘటన మాత్రం నా మనసులో నిలిచిపోయింది. ఆ క్షణంలోనే నాకు ఓ ఆలోచన వచ్చింది. జీవనోపాధి కోసం బయటకు వెళుతున్న మహిళలు భారతదేశంలో ఎందరో ఉన్నారు. కానీ ఎక్కువ మంది వాహనాలు నడపడం లేదు. దీనికి కారణం ఏంటి అనే ప్రశ్న మొదలయింది. ఈ ప్రశ్నే వీఉఔఉ (మూవింగ్ ఉమెన్) సోషల్ ఇనిషియేటివ్స్‌ను స్థాపించేలా చేసింది. ఇది లాభాపేక్షలేని సంస్థ. సాధికారికంగా మహిళలను శక్తివంతం చేసే లక్ష్యంతో ఇది పని చేస్తున్నది. ప్రస్తుతం మేము వీఉఔఉ ఫ్లీట్‌ను కూడా నిర్మిస్తున్నాము. రవాణా రంగంలో కూడా మహిళల సంఖ్య పెంచాలనే లక్ష్యంతో నడుస్తున్నది.
మెరుగైన జీవనోపాధి
వీరు 2022లో వీఉఔఉ ఫ్లీట్‌ను ప్రారంభించారు. ఇది లాభాపేక్షతో కూడిన స్టార్టప్. మహిళా డ్రైవర్లను నియమించుకోవడం, రవాణా రంగంలో మెరుగైన జీవనోపాధి కల్పించడంపై దృష్టి సారించారు. మహిళా డ్రైవర్లకు అవకాశాలు వస్తున్నప్పటికి వాష్‌రూమ్ వంటి సౌకర్యాలు లేకపోవడం కొంత ఇబ్బందిగా వుంది. ఇలాంటి సమస్యలు పరిష్కరించే ప్రయత్నంలో ఉన్నారు. మహిళలకు అన్ని విధాలుగా ఉత్తమ ప్లాట్‌ఫారమ్‌లు ఏమిటో గుర్తించడానికి వీఉఔఉ ఫ్లీట్ ప్రయత్నిస్తోంది. శిక్షణ తర్వాత ఈ స్టార్టప్ 50 మంది మహిళలకు బ్లూ డార్ట్‌లో ఉపాధి కల్పించింది. అలాగే ఉబెర్‌తో పైలట్‌ను కూడా నడుపుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఒంటరి తల్లి కల్పన వీఉఔఉ ఫ్లీట్‌కు రాక ముందు అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. ”శిక్షణ తర్వాత నేను వీఉఔఉ ఫ్లీట్‌తో కలిసి పని చేస్తున్నాను. ఇందులోకి వచ్చి ఇప్పటికి ఆరు నెలలు అవుతుంది. చాలా సంతోషంగా, గౌరవంగా జీవిస్తున్నాను. నా ఆదాయం కూడా పెరిగింది. పిల్లల్ని చక్కగా చదివించుకుంటున్నాను” ఆమె చెప్పింది.