– ఏఎంహెచ్‌ఓ భార్గవ్ నారాయణ
నవతెలంగాణ-బంజారాహిల్స్
ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు, కాల్చివేత తరలింపు ప్రక్రియలను పటిష్టంగా అమలు చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఏఎంహెచ్‌ఓ భార్గవ్ నారాయణ తెలిపారు. ఖైరతాబాద్ సర్కిల్ 17లో ఏఎంఎచ్‌ఓగా విధులు నిర్వహిస్తున్న ఆయన్ను అదనంగా జూబ్లీహిల్స్ సర్కిల్ 18 అధికారిగా నియమించారు. గురువారం బంజారాహిల్స్‌లోని కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆధీనంలో కొనసాగుతున్న మెగా ఇంజినీరింగ్ వారితో కలిసి వ్యర్థాల తరలింపు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ప్రధానంగా సూపర్వైజరు, ఎస్‌ఎఫ్‌ఏలు ప్రత్యేక దష్టికి కేంద్రీకరిస్తే సమస్యల నుంచి సులువుగా బయటపడవచ్చు అని వివరించారు. లక్ష సాధన కోసం సమయ పాలనతో పాటు ప్రతి వీధి కాలనీ ప్రజలతో కలిసి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం ముఖ్యమని చెప్పారు. ప్రభుత్వం గతంలో తడి, పొడి వ్యర్థాలను వేరుగా వేయాలని ప్రజలకు డస్ట్ బిన్స్ కూడా పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా సరే కొందరు కావాలని వ్యర్థాలను రహదారులపై ఖాళీ ప్రదేశాల్లో డ్రయినేజీల్లో నాళాల్లో పారవేస్తూ కొన్ని రోజుల తర్వాత వాటికి నిప్పు పెట్టడం జరుగుతుందని, ఇలా చేయడం వల్ల ప్రజా ఆరోగ్యానికి నష్టం కలుగుతుందని అన్నారు. ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే తాము ప్రజల సహకారం లేకుండా ఏ పనిని సఫలీకతం చేయలేమని దయచేసి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వివిధ వీధుల్లో వాహనాలు వెళ్లకపోవడం వల్ల కొన్ని రోజులుగా వ్యర్థాలు అలాగే ఉంటున్నాయని, ఎక్కువగా వీటిపైనే దష్టి కేంద్రీకరించామని, తమకు ఫిర్యాదులు కూడా ఎక్కువగా ఇటువంటి వస్తాయని చెప్పారు. ప్రజలు సహకారం అందిస్తే సులభంగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు.
వ్యర్థాల తొలగింపు చర్యలే ప్రధాన లక్ష్యం
9:46 am