మల్టీపర్పస్‌ సెంటర్స్‌ విధానాన్ని రద్దు చేయాలి

– గురుకుల అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలి
– స్థానిక జిల్లాల్లోనే అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలుండాలి
– ప్రభుత్వం హెలికాప్టర్‌ సౌకర్యం కల్పించాలి
– డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్‌, పీవైఎల్‌ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గురుకుల బోర్డు ఆధ్వర్యంలో ఈనెల ఒకటి నుంచి 23 వరకు నిర్వహించే రాతపరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్‌, పీవైఎల్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. మల్టీపర్పస్‌ సెంటర్స్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరాయి. పరీక్షా కేంద్రాలను స్థానిక జిల్లాల్లోనే ఏర్పాటు చేయాలని సూచించాయి. ఒకే అభ్యర్థికి మూడు, నాలుగు జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను కేటాయించడంతో నిరుద్యోగుల్లో గందరగోళం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న ప్రతీ అభ్యర్థికీ హాల్‌టికెట్లను ఇవ్వాలని కోరాయి. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్‌, పీవైఎల్‌ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని గురుకుల భవన్‌ వద్ద ఉన్న గురుకుల బోర్డ్‌ కన్వీనర్‌ మల్లయ్య బట్టు కార్యాలయ ఆవరణలో అభ్యర్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. వారితో పోలీసులు వాగ్వాదానికి దిగారు. అనంతరం గురుకుల బోర్డ్‌ డిప్యూటీ కార్యదర్శి తిరుపతయ్యకు ఆయా యువజన సంఘాల బృందం వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధర్మేంద్ర, పీవైఎల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ ప్రదీప్‌ మాట్లాడుతూ జేఎల్‌, డీఎల్‌, టీజీటీ, పీజీటీ, లైబ్రేరియన్‌ పరీక్షలు రాసే వారికి కేటాయించిన మల్టీపర్పస్‌ (ఒకే అభ్యర్థి మూడు జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించడం) విధానంతో అభ్యర్థులు నష్టపోయే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానంతో సుదూర ప్రాంతాలకు వెళ్లలేని గర్భిణీలు, వికలాంగులు, పిల్లల తల్లులతోపాటు ఆర్థిక స్తోమతలేని నిరుద్యోగులకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. ఎన్నో ఏండ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తోన్న వారికి ఈ విధానాలు నష్టం చేకూరుస్తున్నాయని విమర్శించారు. ఒకవేళ ఇదే నిబంధనలు విధిస్తే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, గురుకుల నియామక బోర్డ్‌ అభ్యర్థులందరికీ హెలికాప్టర్‌ సౌకర్యం ద్వారా పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో గత రెండు వారాలుగా భారీ వర్షాల వల్ల పరీక్ష కేంద్రాలన్నీ దుర్భర స్థితిలో ఉన్నాయనీ, ఇలాంటి సమయంలో గురుకుల బోర్డ్‌ తీసుకున్న నిర్ణయం అభ్యర్థులకు శాపంలా మారుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. మల్లయ్య బట్టు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనీ, నిరుద్యోగులకు నష్టం వాటిల్లే విధానాలు అనుసరిస్తున్నారని వాపోయారు. అభ్యర్థులకు అందుబాటులో లేకుండా ఉంటున్నారని విమర్శించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కన్వీనర్‌ను తొలగించాలనీ, జవాబుదారీతనంగా వ్యవహరించే అధికారిని నియమించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి నిర్లకంటి శ్రీకాంత్‌, డీవైఎఫ్‌ఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి జావీద్‌, పీవైఎల్‌ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి బి కృష్ణ, నాయకులు రవి కుమార్‌ తదితర పాల్గొన్నారు.
ఒకే జిల్లాలో పరీక్ష కేంద్రాలుండాలి : టీపీటీఎల్‌ఎఫ్‌
గురుకుల పోస్టుల రాతపరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఒకే జిల్లాలో కేంద్రాలను కేటాయించాలని టీపీటీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ ఎ విజరుకుమార్‌ డిమాండ్‌ చేశారు. అభ్యర్థులకు వేర్వేరు జిల్లాల్లో కేంద్రాలు వేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటునాఉనరని ఒక ప్రకటనలో తెలిపారు.