– మణిపూర్ హింసపై సుప్రీం ఆగ్రహం
– విచారణ జరిపేది ఇలాగేనా..?: పోలీసులను నిలదీసిన కోర్టు
– కేసుల నమోదులో తీవ్ర జాప్యం జరిగిందని మండిపాటు
– విచారణ కూడా నత్తనడకలా సాగుతోందని వ్యాఖ్య
అవిశ్వాస తీర్మానంపై 8న చర్చ
అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 8 నుంచి 10 మధ్య పార్లమెంట్‌లో చర్చ జరగనుంది. ఈ మేరకు మంగళవారం జరిగిన లోక్‌సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)లో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ బీఏసీ సమావేశాన్ని ప్రతిపక్షాలు బహిష్కరించాయి. అవిశ్వాస తీర్మానంపై తక్షణమే చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ తీర్మానంపై ప్రధాని మోడీ శుక్రవారం మధ్యాహ్నం స్పందించే అవకాశం ఉందని ప్రభుత్వం సమావేశంలో పేర్కొంది.
న్యూఢిల్లీ : మణిపూర్‌లో రాజ్యాంగ వ్యవస్థ కుప్పకూలిందని సుప్రీంకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతి భద్రతలను పరిరక్షించడంలో ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు దారుణంగా విఫలమయ్యారని తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు తన ఎదుట స్వయంగా హాజరు కావాలని, తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని మణిపూర్ డీజీపీని ఆదేశించింది. రాష్ట్రంలో దాఖలైన 6,523 ఎఫ్‌ఐఆర్‌లపై ప్రభుత్వం సమర్పించిన నివేదికను ప్రస్తావిస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. మణిపూర్‌లో జరిగిన దారుణాలపై సకాలంలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంలో పోలీసులు దారుణంగా విఫలమయ్యారని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్ధివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మండిపడింది. రాష్ట్రంలో జాతుల మధ్య తలెత్తిన ఘర్షణలను నివారించడంలో పోలీసుల వైఫల్యాన్ని ఎత్తిచూపింది. ‘ఘర్షణలు ప్రారంభమైన మే నెల నుండి ఇప్పటి వరకూ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ కుప్పకూలిందని ప్రభుత్వ నివేదిక తేటతెల్లం చేస్తోంది. రాష్ట్రంలో అసలు చట్టమన్నదే అమలు కాలేదు. శాంతి భద్రతల పరిరక్షణలో పూర్తి వైఫల్యం కన్పిస్తోంది. ప్రజలను, చట్టాలు కాపాడలేకపోతే ఇక వారికి దిక్కెవరు?’ అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించింది.
పోలీసుల నిష్క్రియాపరత్వం
కేసుల విచారణ నత్తనడక నడుస్తోందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. సంఘటనలు జరిగిన సమయం, ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన సమయం, సాక్షుల స్టేట్‌మెంట్లు తీసుకున్న సమయం…ఈ మూడింటి మధ్య చాలా కాలహరణం జరిగిందని తెలిపింది. అరెస్టులు కూడా చాలా తక్కువ సంఖ్య లో జరిగాయని చెప్పింది. రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితుల కారణంగా పోలీ సులు కొన్ని పరిమితులకు లోబడి వ్యవహరించి ఉంటారని తుషార్ మెహతా కోర్టు కు విన్నవించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ స్పందిస్తూ ‘మే 4 నుండి జూలై 27 వరకూ పోలీసుల నిష్క్రియాపరత్వం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. కనీసం ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదు చేయలేని పరిస్థితి నెలకొన్నదా? ఏవో ఒకటి రెండు కేసులలో తప్ప ఎక్కడా అరెస్టులు జరగలేదు. కొన్ని చోట్ల సంఘటన జరిగిన రెండు నెలల తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బాధితుల స్టేట్‌మెంట్లు కూడా తీసుకోలేదు’ అని ఎత్తిచూపారు. విచారణను సీబీఐకి అప్పగించడాన్ని ప్రస్తావిస్తూ ఆరు వేలకు పైగా కేసులను ఒక్క దర్యాప్తు సంస్థ ఎలా విచారించ గలదని ప్రశ్నించారు. ఇప్పటికే అనేక కేసుల విచారణలో సీబీఐ తలమునకలై ఉన్నదని, ఆ సంస్థ కూడా అచేతనంగా ఉండిపోతోందని వ్యాఖ్యానించారు.
అసమగ్ర నివేదిక
కేసుల విచారణలో పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రే నివేదిక ఇవ్వడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. ఒక సంఘటనలో తల్లిని కారు నుండి బయటికి లాగి కుమారుడితో సహా చిత్రవధ చేశారు. సంఘటన మే 4న జరిగితే జూలై 23న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మరో ఘటనలో ఓ వ్యక్తిని చంపేసి, అతని ఇంటిని తగలబెడితే రెండు నెలల తర్వాత కేసు పెట్టారు. మరో ఘటనపై విచారణ మొదలైనప్పుడే సీసీటీవీ దృశ్యాలు అదృశ్యమై పోయాయి. నూట యాభై మంది చనిపోయారని రాష్ట్ర ప్రభుత్వ నివేదిక చెబుతోంది. అందులో 59 మంది మే 3-5 తేదీల మధ్యనే ప్రాణాలు కోల్పోయారు.మే 27-29 తేదీల మధ్య మరో 28 మంది బలయ్యారు. జూన్ 9న జరిగిన హింసలో 13 మంది చనిపోయారు. ప్రభుత్వం సమర్పించిన నివేదిక అసమగ్రంగా ఉన్నదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ‘మీరు చెబుతున్న కేసులలో ఎన్ని హత్యకు సంబంధించినవో, ఎన్ని అత్యాచారాలకు సంబంధించినవో తెలపలేదు. గృహదహనాలు, దోపిడీలు, ఆస్తుల విధ్వంసాలు, ప్రార్థనా స్థలాల ధ్వంసాలు వంటి వాటికి సంబంధించిన సమాచారం తెలపలేదు’ అని నిలదీసింది. తదుపరి విచారణ జరిగే ఆగస్ట్ 7వ తేదీ నాటికి అదనపు సమాచారం అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది.