అసెంబ్లీ ముందు యూత్‌ కాంగ్రెస్‌ ఆందోళన

Youth Congress agitation before Assembly– ఉద్రిక్తత.. నేతల అరెస్టు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై యూత్‌ కాంగ్రెస్‌ శుక్రవారం ఆందోళన చేపట్టింది. నిరుద్యోగ భతి వెంటనే ఇవ్వాలని, ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో అసెంబ్లీలోకి దూసుకుపోవడానికి యూత్‌ కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నించారు. గన్‌పార్కు వద్ద నడిరోడ్డుపైనే యూత్‌ కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. రెండు గ్రూపులుగా వచ్చిన నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి ఆయా పోలీసు స్టేషన్లకు తరలించారు. అసెంబ్లీ వైపు దూసుకొస్తున్న యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివసేనరెడ్డితో పాటు నగర అధ్యక్షుడు మోటా రోహిత్‌, ఇతర నేతలను అరెస్టు చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వడంలో, ఉద్యోగాలను భర్తీ చేయడంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని వారు ఈ సందర్భంగా విమర్శించారు.