10,11గంటలూ కరెంట్‌ ఇవ్వడంలే

– రేవంత్‌ ఏం అన్నారో తెలుసుకోకుండా ధర్నాలా?
– ఇకనైనా నాటకాలు కట్టిపెట్టండి :ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నవ తెలంగాణ- భువనగిరి రూరల్‌
మంత్రి కేటీఆర్‌ 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తున్నామంటున్నారని, కానీ 10, 11 గంటలకు మించి రైతులకు కరెంట్‌ ఇవ్వడం లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం యాదాద్రిభువనగిరి మండలంలోని బండసోమారం సబ్‌స్టేషన్‌ను ఆయన సందర్శించారు. సబ్‌ స్టేషన్‌ లాగ్‌బుక్‌ వివరాలను పరిశీలించారు. అక్కడ పని చేస్తున్న వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులకు ఇంకా జీతాలు రాలేదని, బండ సోమవారం సబ్‌ స్టేషన్‌లో పని చేస్తున్న బాల నర్సయ్యను ఎలా బతుకుతున్నారని అడిగితే అప్పు చేసి బతుకుతున్నామని చెప్పాడని అన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌.. ఒకసారి బాల నర్సయ్య లాంటి వారి బాధలు వినాలన్నారు. రైతులకు 24 కరెంట్‌ అందడం లేదని, బండ సోమవారం సబ్‌ స్టేషన్‌ బుక్‌లో అన్ని వివరాలూ ఉన్నాయని, బీఆర్‌ఎస్‌ వాళ్లు పని లేక ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఇసుక మాఫియా, ల్యాండ్‌ మాఫియాతో బీఆర్‌ఎస్‌ వాళ్లు కోట్లు సంపాదించారని, డబ్బులు ఇచ్చి ధర్నాలు చేయించారని ఆరోపించారు. 24 గంటల కరెంట్‌ అంటున్న మంత్రి కేటీఆర్‌ను బండ సోమవారం సబ్‌ స్టేషన్‌ నుంచి ప్రశ్నిస్తున్నానని అన్నారు. 10, 11 గంటలకు మించి రైతులకు కరెంట్‌ ఇవ్వడం లేదని, మధ్యలో కట్‌ కూడా అవుతోందనారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో 9 గంటల ఉచిత కరెంట్‌ అందించామనారు. దేశంలో ఉచిత కరెంట్‌ తీసుకొచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ అన్నారు. కాంగ్రెస్‌కు పెరిగిన ప్రజాదరణ చూసి ఓర్వలేక, ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్‌ నాటకాలు ఆడుతోందనారు. బీఆర్‌ఎస్‌ ధర్నాను అడ్డుకున్నారని మహబూబ్‌నగర్‌లో సబ్‌ మెజిస్ట్రేట్‌ భర్తపై దాడి చేశారని, ఆఖరికి కానిస్టేబుల్‌ పైనా దాడికి పాల్పడ్డారని, ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడారో తెలియకుండా ధర్నాలు చేస్తారా? ప్రజలను ఇబ్బంది పెడతారా? నాటకాలు ఇకనైనా ఆపండి అని హెచ్చరించారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో 24 గంటల ఉచిత కరెంట్‌ హామీని పెడతామని ఠాక్రే చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్‌ నాయకులు పంజాల రామాంజనేయులు గౌడ్‌, పోత్నక్‌ ప్రమోద్‌ కుమార్‌, నానం కృష్ణ గౌడ్‌, గోదా శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులు ఉన్నారు.

Spread the love