విద్యాబోధన, పరిశోధనకు వర్చువల్‌ ల్యాబ్స్‌ ఉపయోగం

– కర్నాటక నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ప్రొఫెసర్‌ కెవి గంగాధరన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి విద్యార్థులకు మరింత సులభంగా విద్యాబోధన, పరిశోధనలకు వర్చువల్‌ ల్యాబ్స్‌ ఉపయోగకరమని సూరత్‌కల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కర్నాటక ప్రొఫెసర్‌ కెవి గంగాధరన్‌ చెప్పారు. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ‘వర్చువల్‌ ల్యాబ్స్‌ పరిచయ వెబినార్‌’ అనే అంశంపై బుధవారం వెబినార్‌ నిర్వహించారు. అధ్యక్షత వహించిన అంబేద్కర్‌ వర్సిటీ వీసీ కె సీతారామారావు మాట్లాడుతూ తమ విశ్వవిద్యాలయాన్ని వర్చువల్‌ ల్యాబ్స్‌ నోడల్‌ కార్యాలయంగా ప్రకటించడం సంతోషమని చెప్పారు. ఇవి దూర విద్యావిధానంలో అభ్యసించే విద్యార్థులకు, పరిశోధకులకు చాలా ఉపయోగమని అన్నారు. దేశంలోని అనేక విద్యాసంస్థల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి అందుబాటులోకి తెస్తున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలతో నేరుగా తమ వర్సిటీ అనుసంధానం కావడం శుభసూచకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సూరత్‌కల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కర్నాటక వర్చువల్‌ ల్యాబ్స్‌ అవుట్‌ రీచ్‌ కోఆర్డినేటర్‌ షీనా, అంబేద్కర్‌ వర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్‌ సైన్సెస్‌ డీన్‌ పుష్పచక్రపాణి, పరీక్షల నియంత్రణాధికారి పరాంకుశం వెంకటరమణ, కంప్యూటర్‌ సెంటర్‌ ఇంచార్జీ వసంతరావు తదితరులు పాల్గొన్నారు.