రవాణా వాహనాలపై ఉక్కుపాదం

–  గ్రేటర్‌లో 715 వెహికిల్స్‌ సీజ్‌
–  మొత్తం రూ.1.16 కోట్ల ట్యాక్స్‌, పెనాల్టీ, కాంపౌండింగ్‌ ఫీజు వసూలు
– కొనసాగుతున్న రవాణాశాఖ తనిఖీలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
పన్నులు చెల్లించకుండా, నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న ట్రాన్స్‌పోర్టు వాహనాలపై రవాణాశాఖ ఉక్కుపాదం మోపుతోంది. గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ఏడాదిన్నరగా త్రైమాసిక పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న వాహనాలపై ఆర్టీఏ అధికారులు విస్తృతంగా దాడులు చేస్తుండటంతో వాహన యజమానులు మీ-సేవ కేంద్రాలకు, ఆర్టీఏ ఆఫీసులకు పరుగులు పెడుతున్నారు. అధికారుల దాడులతో స్వచ్ఛందంగా పన్నులు చెల్లించేందుకు కొంతమంది ముందుకొస్తున్నట్టు సమాచారం. కొద్ది రోజుల కిందట సీఎస్‌ నేతృత్వంలో వివిధ శాఖలకు సంబంధించి జరిగిన సమీక్షా సమావేశంలో ఆయా శాఖలకు వివిధ రూపాల్లో రావాల్సిన ఆదాయంపై చర్చ జరిగినట్టు సమాచారం. ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ ఆధ్వర్యంలో ఆర్టీఏ ఉన్నతాధికా రులతో సమావేశమై ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని నిర్ణయించారు. ఈ తనిఖీలను ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు వరకు చేపట్టి.. పన్ను బకాయిలను పూర్తి స్థాయిలో రాబట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారని తెలిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తొమ్మిది త్రైమాసికాలుగా పేరుకుపోయిన పెండింగ్‌ ట్యాక్స్‌ లను రాబట్టేందుకు ఆర్టీఏ అధికారులు సీరియస్‌గా దృష్టిపెట్టారు. బృందా లుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. అధికారుల దాడులతో కొంతమంది తమ వాహనా లపై ఉన్న పెండింగ్‌ ట్యాక్స్‌లను క్లియర్‌ చేస్తున్నట్టు ఆర్టీఏ వర్గాలు వెల్లడించాయి.
ఆరు రోజుల్లో రూ.1.16కోట్లు వసూలు
గ్రేటర్‌ పరిధిలోని మూడు జిల్లాల్లో ఈ నెల 15 నుంచి నిర్వహిస్తున్న ఆర్టీఏ తనిఖీల్లో ఇప్పటివరకు 715కుపైగా ట్రాన్స్‌పోర్టు వాహనాలను సీజ్‌ చేశారు. వీటి ద్వారా దాదాపు రూ.1,16,35,535 కోట్లు ప్రభుత్వ ఖాజానాకు చేరింది. హైదరాబాద్‌ జాయింట్‌ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ జేటీసీ జె.పాండురంగ నాయక్‌ ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌, మలక్‌పేట్‌, సికింద్రాబాద్‌, మెహిదీ పట్నం, బండ్లగూడలోని కార్యాలయ పరిధిలో ఇప్పటివరకు 244 వాహనాలను సీజ్‌ చేయగా.. వాటి నుంచి కాంపౌండింగ్‌ ఫీజు కింద రూ.8.49లక్షలు వసూలు చేశారు. ట్యాక్స్‌ రూపంలో రూ.32.03 లక్షలు రాబట్టారు. పెనాల్టీ ద్వారా రూ.9.71లక్షలు వసూలు చేశారు. రంగారెడ్డి జిల్లాలోని అత్తాపూర్‌, ఇబ్రహీంపట్నం కార్యాలయ పరిధిలో ఇప్పటివరకు 336 ట్రాన్స్‌పోర్టు వాహనాలను సీజ్‌ చేశారు. సదరు వాహనాల ద్వారా కాంపౌండింగ్‌ ఫీజు కింద రూ.9.90లక్షలు, ట్యాక్స్‌ ద్వారా 10.19లక్షలు, పెనాల్టీ రూపంలో రూ.14.51 లక్షల వసూలు చేశారు. మరో 125 వాహనాలను రిలీజ్‌ చేయాల్సి ఉందని సంబంధిత జిల్లా అధికారి తెలిపారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్‌, ఉప్పల్‌, కూకట్‌పల్లి యూనిట్‌ కార్యాలయ పరిధిలో జిల్లా రవాణాధికారి కిషన్‌ నాయక్‌ ఆధ్వర్యంలో దాడులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 145కుపైగా వాహనాలను సీజ్‌ చేశారు. వీటి ద్వారా కాంపౌండింగ్‌ ఫీజు రూపంలో రూ.6.5లక్షలు, ట్యాక్స్‌ ద్వారా 18.6లక్షలు వసూలు కాగా.. పెనాల్టీ రూపంలో రూ.5.49లక్షలు వసూలైంది. ఇలా మొత్తంగా హైదరాబాద్‌ జిల్లాలో రూ.50.25లక్షలు, రంగారెడ్డిలో రూ.35.39 లక్షలు, మేడ్చల్‌ జిల్లాలో రూ.30.70లక్షలు వసూలయ్యాయని సంబంధిత అధికారులు తెలిపారు.
సీజ్‌ చేస్తే.. 200 శాతం పెనాల్టీ
రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌ కొనసాగుతుంది. ట్యాక్స్‌ చెల్లించకుండా రోడ్డు మీద తిప్పడం నిబంధనలకు విరుద్ధం. ట్యాక్స్‌ చెల్లించని వాహనాలను జప్తు చేయాల్సి ఉంటుందని, అలాంటి వాహనాలను విడుదల చేయడానికి ట్యాక్స్‌తో పాటు 200శాతం పెనాల్టీ చెల్లించాల్సి వస్తుందని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. సదరు పెనాల్టీ తగ్గించడానికి చట్ట ప్రకారం అవకాశం లేదు. వాహన యజమానులు తమ వాహనాలకు సంబంధించిన పెండింగ్‌ ట్యాక్స్‌లు వెంటనే మీసేవ, ఈ-సేవ కేంద్రాలకు వెళ్లి చెల్లించాలని సూచిస్తున్నారు.