లోక్‌సభ సెక్రటేరియట్‌కు సుప్రీంకోర్టు తీర్పు కాపీ

– అందజేసిన కాంగ్రెస్‌ లోక్‌సభ పక్షనేత
– అధిర్‌ రంజన్‌ చౌదరి
– సభ్యత్వం రద్దు చేసినప్పుడు ఉన్న స్పీడ్‌ ఇప్పుడేమైంది?
న్యూఢిల్లీ : పరువు నష్టం కేసులో సూరత్‌ కోర్టు కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీకి విధించిన శిక్షపై స్టే విధించిన సుప్రీంకోర్టు తీర్పు కాపీని అధికారికంగా లోక్‌సభ సెక్రటేరియట్‌కు కాంగ్రెస్‌ అందజేసింది. ఈ మేరకు శనివారం ఆ పార్టీ లోక్‌సభ పక్షనేత అధిర్‌ రంజన్‌ చౌదరి అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌ సభ్యత్వాన్ని పునరుద్ధరించే విషయంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని ఆయన తప్పు పట్టారు. రాహుల్‌ సభ్యత్వాన్ని రద్దు చూసినప్పుడు చూపించిన స్పీడు.. సభ్యత్వం పునరుద్ధరించే విషయంలో ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి జాప్యపు ఎత్తుగడలు సరికాదని అధీర్‌ రంజన్‌ చౌదరి పేర్కొన్నారు. ”రాహుల్‌ గాంధీకి విధించిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దాని అర్ధం ఏమిటి? పార్లమెంట్‌ కార్యక్రమాల్లో ఆయనకు తిరిగి పాల్గొనే అవకాశం కల్పించినట్టే. రాహుల్‌పై అనర్హత వేటు వేసేందుకు చూపించిన స్పీడునే ఇప్పుడు సభ్యత్వం పునరుద్ధరించే విషయంలోనూ చూపించాల్సి ఉంటుంది” అని అన్నారు. స్పీకర్‌ను తాను శుక్రవారం రాత్రి కులుసుకున్నానని, ఆయన శనివారం రమ్మన్నారని, ఇవాళ కలిసినప్పుడు ఈ అంశాన్ని ఆయన సెక్రటరీ జనరల్‌కు రిఫర్‌ చేసి సంబంధిత డాక్యుమెంట్లను కార్యాలయంలో సమర్పించాలని చెప్పారని తెలిపారు. తాను సెక్రరటరీ జనరల్‌ను కలిశానని, తన కార్యాలయానికి సెలవు అయినందున స్పీకర్‌కు లెటర్‌ సమర్పించమని ఆయన చెప్పారని, లెటర్‌పై వాళ్లు సంతకం చేసినప్పటికీ స్టాంప్‌ వేయలేదని అధీర్‌ రంజన్‌ తెలిపారు. సభ సజావుగా సాగేందుకు, రాహుల్‌ తిరిగి సభకు వచ్చేందుకు స్పీకర్‌ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాహుల్‌కు కోర్టు స్టే ఇచ్చినప్పుడు, ఆయన తిరిగి సభలోకి అడుగుపెట్టేందుకు ఎలాంటి అవరోధాలు లేకుండా చూడాలని స్పీకర్‌కు అధీర్‌ రంజన్‌ విజ్ఞప్తి చేశారు. రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడంలో జరిగిన ”ఆలస్యం” గురించి ప్రశ్నిస్తూ కాంగ్రెస్‌ కమ్యూనికేషన్‌ చీఫ్‌ జైరామ్‌ రమేష్‌ ”అవిశ్వాస తీర్మానంలో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోడీ భయపడుతున్నారా?” అని ప్రశ్నించారు. ”సుప్రీం కోర్టు అన్యాయమైన నేరారోపణపై స్టే విధించి 26 గంటలు గడిచింది. ఆయన ఎంపి పదవిని ఇంకా ఎందుకు పునరుద్ధరించలేదు? అవిశ్వాస తీర్మానంలో పాల్గొనేందుకు ప్రధాని భయపడుతున్నారా?” అని ప్రశ్నించారు.