భాషాపండితులకు న్యాయం చేయండి

– మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, సబితకు ఆర్‌యూపీపీటీఎస్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భాషాపండితులకు న్యాయం చేయాలని ఆర్‌యూపీపీటీఎస్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, ఆర్థిక శాఖ మంత్రి టి హరీశ్‌రావు, విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని శనివారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ, శాసనమండలిలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సి జగదీశ్‌, ప్రధాన కార్యదర్శి ఎస్‌ నర్సింహులు నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. భాషా పండితుల అప్‌గ్రెడేషన్‌ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలనీ, అందరికీ పదోన్నతులు కల్పించాలని కోరారు. డీఎస్సీ-2002 ద్వారా ఎంపికైన హిందీ భాషాపండితులకు జరిగిన అన్యాయాన్ని పరిశీలించాలనీ, పాత పెన్షన్‌ను వర్తింపజేయాలని సూచించారు.
రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులలో భాషా పండితులకు జరుగుతున్న నష్టాన్ని నివారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలపై మంత్రులు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌యూపీపీటీఎస్‌ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు ఇశ్రాయేలు, నాగర్‌ కర్నూలు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయకుమార్‌, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలి : టీటీయూ
రాష్ట్రంలో మొదటి పీఆర్సీ గడువు జూన్‌ 30తో ముగిసిందనీ, గతనెల ఒకటి నుంచి కొత్త వేతనాలను అమలు చేసేందుకు రెండో పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలని టీటీయూ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, పి సబితా ఇంద్రారెడ్డిని శనివారం ఆ సంఘం అధ్యక్షులు ఎం మణిపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహస్వామి కలిసి వినతిపత్రం సమర్పించారు. ఐఆర్‌ ప్రకటించాలని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని సూచించారు.