మూఢ నమ్మకాలను విశ్వసించరాదు: ఎస్సై రాజు

నవతెలంగాణ- పెద్దవంగర: మూఢనమ్మకాలను ఎవరూ విశ్వసించరాదని ఎస్సై రాజు సూచించారు. మంగళవారం రాత్రి మండల పరిధిలోని రామచంద్రు తండాలో గ్రామ పంచాయతీ ఆవరణలో పోలీసు కళాబృందం నాటక ప్రదర్శన నిర్వహించింది. ప్రజల్లోని మూఢ నమ్మకాలు, ఆడపిల్లలు, మహిళలపై అఘాయిత్యాలు, ఆన్‌లైన్‌ మోసాలపై నాటకాలను ప్రదర్శించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. చేతబడి, బాణామతి చేశారనడం అనేవి వట్టి మాటలేనని, డబ్బులు సంపాదించాలనే కొంత మంది వీటిని ప్రచారం చేస్తున్నారన్నారు. అమ్మాయిలకు, మహిళలకు సహాయం చేసేందుకే షీ టీమ్‌లను ఏర్పాటు చేశామని, చిన్న వయసులో అమ్మాయిలు ప్రేమ పేరిట మోసపోవద్దని, మహిళలను వేధిస్తే ఎవరైనా షీ టీమ్‌లకు సమాచారం ఇవ్వాలని అన్నారు. యువకులు వ్యసనాలకు బానిసై దొంగలుగా మారుతున్నారన్నారు. యువకులు చదువుపై దృష్టి పెట్టి, బాగా చదువుకోవాలని, యవకులు నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చునని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, వారితో లైసెన్స్‌తో పాటు వాహన పత్రాలన్నీ కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది సురేష్, ఈర్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.