టీఎస్‌ సెట్‌ పరీక్ష తేదీని మార్చండి

–   ఓయూ వీసీకి సంతోష్‌కుమార్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించే మార్చి 13న టీఎస్‌ సెట్‌ కూడా జరుగుతున్నందున ఆ పరీక్ష తేదీని మార్చాలని టీఎస్‌టీసీఈఏ అధ్యక్షులు, ఎమ్మెల్సీ అభ్యర్థి అయినేని సంతోష్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సెట్‌ చైర్మెన్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) వీసీ డి రవీందర్‌, రిజిస్ట్రార్‌ లక్ష్మినారాయణను శుక్రవారం ఆయన కలిసి వినతిపత్రం సమర్పించారు. టీఎస్‌ సెట్‌ను మార్చి 13,14,15 తేదీల్లో నిర్వహించనున్నట్టు షెడ్యూల్‌ను ప్రకటించారని గుర్తు చేశారు. అయితే టీఎస్‌ సెట్‌కు కొంత మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు కూడా హాజరవుతారని తెలిపారు. ఒకేరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆ పరీక్ష ఉండడం వల్ల వారు ఇబ్బందులు పడే అవకాశముందని పేర్కొన్నారు. అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్ష తేదీని మార్చాలని కోరారు.