సీపీఐ(ఎం) కార్యాలయాలు కష్టజీవుల పోరాట కేంద్రాలు

– ఉద్యమాల రూపకల్పనకు వేదికలు : కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య
నవతెలంగాణ- మహబూబాబాద్‌
సీపీఐ(ఎం) కార్యాలయాలు కష్టజీవులు, పేదల సమస్యల పరిష్కారానికి పోరాట కేంద్రాలుగా నిలబడాలని, ప్రజా పోరాటాల నిర్మాణం చేయాలని కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబాబాద్‌ జిల్లాలోని కురవి మండల కేంద్రంలో సీపీఐ(ఎం) కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి మల్లేడి కోటయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో నాగయ్య మాట్లాడారు. కమ్యూనిస్టు కార్యాలయాలు పేదలకు అండగా ఉంటాయని, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటాల రూపకల్పనకు వేదికలవుతాయని చెప్పారు. రాబోయే కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టులు మరిన్ని పోరాటాలు నిర్వహించాలని అన్నారు. దేశంలో బీజేపీ మతోన్మాదాన్ని, పాసిజాన్ని అమలు చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను విభజించి పాలిస్తూ విద్వేషాలను రగిలిస్తోందన్నారు. ప్రజావ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తే కమ్యూనిస్టులు, మేధావులు.. ఇతర ప్రజాగళాలను దేశద్రోహులుగా చిత్రీకరించి జైళ్లల్లో పెడుతోందని, ఇందుకు రాజ్యాంగ సంస్థలైన సీబీఐ, ఈడీలను ఉపయోగిస్తోందని విమర్శించారు. బీజేపీ మతోన్మాద, ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలందరూ ఐక్యంగా పోరాడాలని సూచించారు. మణిపూర్‌ ఘటన దేశం మొత్తం సిగ్గుపడేదని, ఒక తెగను మరో తెగపైకి ఉసిగొల్పి దాడులు నిర్వహించడంలో ప్రభుత్వం పాత్ర స్పష్టంగా తేలిందని అన్నారు. మోతీ వర్గం దాడుల్లో 150 మంది కాల్చివేయబడ్డారని, వేలాదిమంది నిరాశ్రయులయ్యారని, అనేక మంది మహిళలపై లైంగిక దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీని ఓడించి లౌకిక పక్షాలను ఐక్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో బీజేపీని ఓడించే పాత్రలో బీఆర్‌ఎస్‌ కలిసి రావాలన్నారు. డోర్నకల్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే వామపక్ష పార్టీల నాయకులపై అక్రమ కేసులు పెట్టడం.. దాడులు దౌర్జన్యాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. గతంలో సీపీఐ(ఎం) చేసిన పోరాట ఫలితంగానే వెన్నవరం కాలువ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిందని గుర్తుచేశారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే ఉమ్మడి జిల్లాలో పేదలకు ఇండ్ల స్థలాలు వచ్చాయని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలిచ్చి వారిని ఆదుకోవాలని కోరారు. ఇంటి స్థలం ఉన్న పేదలకు మూడు లక్షల కాకుండా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంతకు ముందు సీనియర్‌ నాయకులు జి.రాములు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి ప్రదర్శనగా బయలుదేరి ఓం ఫంక్షన్‌ హాల్‌ వద్ద సభ నిర్వహించారు. ఈ సభలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్‌ రెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆకుల రాజు, శెట్టి వెంకన్న, గునగంటి రాజన్న, ఆల్వాల వీరయ్య, కందునూరి శ్రీనివాస్‌, ఆంగోత్‌ వెంకన్న, సీపీఐ(ఎం) మండల కార్యదర్శివర్గ సభ్యులు నల్లపు సుధాకర్‌ పిట్టల వెంకన్న, ఎస్‌.కె మన్సూర్‌, ఎస్డి కాజా, జక్కుల మల్లయ్య, మాలోత్‌ కిషన్‌, కట్ల కృష్ణయ్య, గంధసిరి జ్యోతిబాసు పాల్గొన్నారు.