– దరఖాస్తు తేదీ నాటి మార్కెట్ ధర ప్రకారం లెక్కింపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని జీవో 59 కింద క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారిపై మరింత భారం పడనుంది. క్రమబద్దీకరణకు అయ్యే మొత్తాన్ని దరఖాస్తు తేదీ నాటి మార్కెట్ ధర ప్రకారం దరఖాస్తుదారులు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈమేరకు జీవో 59కి సవరణ చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ బుధవారం జీవో 22 జారీ చేశారు. 2014 డిసెంబరు 30న ఇచ్చిన జీవో 59లో 2014 జూన్ 2వ తేదీ నాడు ఉన్న మార్కెట్ ధర ప్రకారం క్రమబద్ధీకరణ మొత్తాన్ని ఖరారు చేయాలని ఉంది. అయితే, ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం భూముల విలువ మార్కెట్ ధరలను పెంచింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్ ఆధారంగా సవరించింది. దీంతో ఆ ధరలకు అనుగుణంగానే క్రమబద్ధీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఇప్పటికే జారీ అయిన డిమాండ్ నోటీసుల స్థానంలో కొత్త నోటీసులు ఇవ్వనున్నారు.