ఇల్లందలో ఘోర రోడ్డు ప్రమాదం

– ఆటోను ఢకొీన్న లారీ.. ఆరుగురు మృతి
– మృతులు బీహార్‌కు చెందిన కూలీలు, వరంగల్‌ జిల్లా ఆటో డ్రైవర్‌
– మరొకరి పరిస్థితి విషమం
– సంఘటన స్థలాన్ని పరిశీలించిన వరంగల్‌ సీపీ రంగనాథ్‌
నవతెలంగాణ-వర్ధన్నపేట
బతుకుదెరువు కోసం బీహార్‌ రాష్ట్రం నుంచి వచ్చిన కూలీలను లారీ చిదిమేసింది.. కాయకష్టం చేసుకుని కుటుంబాలను పోషించుకున్న వలస కూలీలు బుధవారం ఉదయం పని కోసం ఆటోలో వెళతుండగా రాజస్థాన్‌కు చెందిన లారీ కబళించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. ఇందులో ఒకరు ఆటో డ్రైవర్‌. ఈ ఘటన వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బీహార్‌ రాష్ట్రానికి చెందిన కొన్ని కుటుంబాలు 20 ఏండ్ల కిందట బీహార్‌ నుంచి హైదరాబాదుకు వచ్చాయి. అందులో కొందరు కొన్ని రోజుల కిందట వరంగల్‌ చేరుకున్నారు. అడవుల్లో చెట్లపై తేనె తుట్టెలు తీసి రహదారుల వెంట తేనె విక్రయించి జీవనం సాగిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం ఆరుగురు యువకులు వరంగల్‌ శివనగర్‌ ప్రాంతానికి చెందిన ఆటోను కిరాయికి మాట్లాడుకుని వర్ధన్నపేటకు బయలుదేరారు. ఆటో 7.45 గంటల సమయంలో ఇల్లంద గ్రామానికి చేరుకోగానే తొర్రూర్‌ వైపు నుంచి వరంగల్‌ వైపు వెళ్తున్న రాజస్థాన్‌ లారీ ఆటోను బలంగా ఢకొీంది. దాంతో ఆటోలో ఉన్న భట్టు శ్రీనివాస్‌(45) (వరంగల్‌ శివనగర్‌ ఆటో డ్రైవర్‌), బీహార్‌కు చెందిన జాబోదు కురెరి (25), సురేష్‌ బీహార్‌ (50), నితీష్‌ మండల్‌ (20), మేరీ బీహార్‌(20), రూప్‌చంద్‌(35) మృతిచెందారు. అమీర్‌ అనే మరో వ్యక్తి మాక్స్‌కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలను పరిశీలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్టు ఎస్‌ఐ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. మృతదేహాలను వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పరిశీలించిన వరంగల్‌ సీపీ రంగనాథ్‌
ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంపై వరంగల్‌ సీపీ ఏవీ రంగనాథ్‌ విచారం వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే ఆయన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలను అధికారులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. లారీ అతివేగం నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వల్లే ఈ ప్రమాదం జరిగిందన్న సీపీ విచారణ చేస్తున్నట్టు వెల్లడించారు. బతుకుదెరువు కోసం వలస కూలీలుగా వచ్చిన వారు ప్రమాదంలో మృతిచెందడం బాధాకరమన్నారు.