వెయ్యేళ్ల బానిసత్వమట !

– మొఘల్‌, బ్రిటీష్‌ పాలనను ఒకే గాట కట్టిన వైనం
– స్వాతంత్య్ర సమరయోధులు, చరిత్రకారుల అభిప్రాయాలకు భిన్నం
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుండి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ దేశం వెయ్యి సంవత్సరాల బానిసత్వంలో మగ్గిపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. ఆయన ఇలా చెప్పడం ఇది మొదటిసారి కాదు. ఇదే విషయాన్ని ఆయన అరిగిపోయిన రికార్డు మాదిరిగా పలు సందర్భాలలో చెబుతూనే ఉన్నారు. ఇటీవల అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు జూన్‌ 23న ప్రతినిధుల సభను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కూడా ఆయన ఇవే మాటలు చెప్పారు. వెయ్యి సంవత్సరాల పాటు ఏదో ఒక రూపంలో విదేశీ పాలనలో ఉన్న తర్వాత భారతదేశం స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోందని సెలవిచ్చారు. అయితే చరిత్రకారులు, స్వాతంత్య్ర పోరాటం లో భాగస్వాములైన సమరయోధుల అభిప్రాయాలకు మోడీ వాదన పూర్తి భిన్నంగా ఉంది.దేశాన్ని తొలుత మొఘలులు, ఆ తర్వాత బ్రిటీష్‌ వారు కలిసి వెయ్యి సంవత్సరాలు పాలించారంటూ ఆర్‌ఎస్‌ఎస్‌, అప్పటి జనసంఫ్‌ చేసిన వాదనను భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తోసిపుచ్చారు. అయినప్పటికీ మొఘలులు, బ్రిటీష్‌ వారి పాలనలో దేశం వెయ్యి సంవత్సరాలు బానిసత్వంలో మగ్గిపోయిందంటూ కొందరు ఇప్పటికీ వాదిస్తూనే ఉన్నారు. మోడీ కూడా ఇదే వాదనను కొనసాగిస్తున్నారు. అయితే చారిత్రక వాస్తవాలను గమనిస్తే ఈ వాదన ఎంతమాత్రం సమర్ధనీయం కాదని అర్థమవుతుంది.
సాక్ష్యాలివిగో…
వాస్తవానికి ముస్లింలీగ్‌, హిందూ మహాసభ, ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థలు ఎన్నడూ స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వాములు కాలేదు. పైగా అవి దేశంలో బ్రిటీష్‌ పాలన కొనసాగేందుకు మద్దతు తెలిపాయి. హిందూత్వ సిద్ధాంతవేత్త వీడీ సావర్కార్‌ చారిత్రక క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ వంటి అలనాటి స్వాతంత్య్ర పోరాట యోధులు, కొందరు చరిత్రకారులు సైతం ఈ కఠోర వాస్తవాలను సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు. ఉదాహరణకు గాంధీజీ రచించిన ‘సావర్కార్‌ సోదరులు’ అనే వ్యాసం 1920 మే 26న యంగ్‌ ఇండియాలో ప్రచురితమైంది.
ఈ వ్యాసంలో ఆయన ఏమన్నారంటే… ‘బ్రిటీష్‌ పాలన నుండి దేశానికి స్వాతంత్య్రం లభించడం తమకు ఇష్టం లేదని ఆ సోదరులు నిర్ద్వందంగా చెప్పారు. బ్రిటీష్‌ వారితో కలిసి ఉంటేనే భారత్‌ సురక్షితంగా ఉంటుందని కూడా వారు అభిప్రాయపడ్డారు’. ఇక నేతాజీ ‘భారతీయుల పోరాటం : 1920-42’ అని రాసిన పుస్తకంలో తాను గాంధీజీతోనూ, ఇండియన్‌ ముస్లింలీగ్‌ అధ్యక్షుడు ఎంఏ జిన్నాతోనూ, హిందూ మహాసభ అధ్యక్షుడు సావర్కార్‌తోనూ జరిపిన సమావేశాలను ప్రస్తావించారు. దేశం వెలుపల నుండి స్వాతంత్య్ర పోరాటాన్ని కొనసాగించేం దుకు బోస్‌ విదేశాలకు వెళ్లబోయే ముందు ఈ సమావేశాలు జరిగాయి. గాంధీజీతో చర్చలు సహృద్భావ వాతావరణంలో జరిగాయని, కానీ మిగిలిన ఇద్దరితో జరిపిన సమావేశాలు అసంతృప్తి కలిగించాయని నేతాజీ రాశారు. ‘భారత్‌లోని బ్రిటీష్‌ సైన్యంలో చేరేందుకు హిందువులకు ఎలా సైనిక శిక్షణ ఇవ్వాలన్న విషయం పైనే సావర్కార్‌ ఆలోచించారు. ముస్లింలీగ్‌ నుండి కానీ, హిందూ మహాసభ నుండి కానీ నేను ఏమీ ఆశించలేదు’ అని తెలిపారు.
తప్పుదోవ పట్టించే ప్రయత్నం
చారిత్రక వాస్తవాలు ఇలా ఉంటే ప్రధాని మోడీ మాత్రం వెయ్యి సంవత్సరాల విదేశీ పాలన, బానిసత్వం అంటూ జాతిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మొఘలుల పాలనలో భారతీయులు కట్టుబానిసలుగా జీవించారంటూ అసత్య ప్రచారం సాగిస్తున్నారు. 1946 డిసెంబర్‌ 17 నాటి రాజ్యాంగ అసెంబ్లీ రికార్డులను ఒకసారి పరిశీలిద్దాం. డిసెంబర్‌ 13వ తేదీన నెహ్రూ అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై జరిగిన చర్చలో జనసంఫ్‌ు వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ మాట్లాడుతూ రాజ్యాంగ అసెంబ్లీ హిందువుల సంస్థ అంటూ లార్డ్‌ సిమన్స్‌ చేసిన ప్రకటనను ప్రస్తావించారు. బ్రిటీష్‌ వారు వ్యాపారులుగా దేశంలో ప్రవేశించారని, ‘గొప్పవారైన’ మొఘలుల ముందు మోకరిల్లారని తెలిపారు. ముఖర్జీ అంటే ప్రధాని మోడీ, ఆయన పార్టీ సహచరులకు ఎంతో గౌరవం. మరి మొఘలులు చాలా గొప్పవారని ముఖర్జీ అంటుంటే ఆయన అనుయాయులు మాత్రం వెయ్యి సంవత్సరాల విదేశీ పాలన అని ఎలా చెబుతున్నారు? అందులో మొఘలుల పాలనను ఎలా చేరుస్తున్నారు?
గాంధీజీ ఏమన్నారంటే…
మహాత్మా గాంధీ మొఘలుల పాలనను బానిసత్వ కాలంగా ఎన్నడూ అభివర్ణించలేదు. 1921 మార్చి 24న కటక్‌లో ఆయన ప్రసంగిస్తూ ‘బ్రిటీష్‌ వారి కంటే ముందు దేశాన్ని పరిపాలించిన వారిది బానిసత్వ పాలన కాదు. మొఘలుల కాలంలో మనం కొంత స్వయం పాలన అనుభవించాము. అక్బర్‌ హయాంలో ప్రతాప్‌ జన్మించారు. ఔరంగజేబు పాలనలో శివాజీ తన ప్రాభవాన్ని చూపారు. కానీ 150 సంవత్సరాల బ్రిటీష్‌ పాలనలో ప్రతాప్‌, శివాజీ వంటి వారు ప్రభావం చూపగలిగారా?’ అని ప్రశ్నించారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుండి మోడీ చేసిన ప్రసంగానికి, 1957లో అదే సందర్భంలో నెహ్రూ చేసిన ప్రసంగానికి మధ్య చాలా వైరుధ్యాలు ఉన్నాయి. 1957వ సంవత్సరంలో దేశ ప్రజలు తొలి స్వాతంత్రోద్యమ పోరాట శత వార్షిక ఉత్సవాలను కూడా జరుపుకున్నారు. ఆ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ బ్రిటీష్‌ పాలన నుండి జరిగిన పోరాటాన్ని మాత్రమే ప్రస్తావించారు. ఈ ప్రసంగం ఇప్పటికీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. భారత వారసత్వ సంపదను గురించి తెలుసుకోవాలని అనుకునే వారు దానిని వినవచ్చు. ప్రజలలో ఓ వర్గం వారిని లక్ష్యంగా చేసుకొని చెప్పే తప్పుడు భాష్యాలను కాకుండా శాంతిని, సంఘీభావాన్ని కోరుకునే వారు కూడా విధిగా నెహ్రూ ప్రసంగాన్ని వినాల్సిన అవసరం ఉంది.