రాలిపోయిన ఎర్ర మందారం

రాలిపోయిన ఎర్ర మందారంఅతడో అంతులేని పాటల పుట్ట
సమస్యల కొమ్మలపై వాలిపోయే పిట్ట
అన్యాయపు సంకెళ్ళ పై అదును చూసి
మాటల బంతులను విసరడంలో దిట్ట
అతడొక ధిక్కార స్వరం
పీడిత ప్రజల పక్షాన మండిన అగ్నిగోళం

కాలికి గజ్జె ను కట్టుకొని, భుజాన గొంగడేసుకొని
రాగమై మొలకెత్తి
పాటని ఫలహారం లెక్క పంచినాడు
ప్రశ్నల కొడవళ్ళను ఎక్కుపెడుతూ
సర్కారుపై మాటల ఫిరంగులను పేల్చినాడు
కాళ్ళకు చక్రాలను కట్టుకొని
అడవి మల్లెల చెంతకు చేరిపోయి
తిరుగుబాటు దారాలను పేని
ఎరుపెక్కిన ఎర్రమందారమై వికసించాడు

పెయ్యిలో తూటాను పెట్టుకొని
కాలం వంతెన పై కదిలిన ధీరుడతడు
అతుకుల బతుకుల పై అక్షర సేద్యం చేస్తూ
పాటల పంటను పండించే కర్షకుడతడు
అణచబడ్డ, చరచబడ్డ, గుడిసెలో జీవితాలు
గొల్లుమన్నప్పుడు మేఘమై ఉరిమాడు
నిప్పుల కొలిమి లా రగిలాడు

తెలంగాణ ఉద్యమంలో పొడుస్తున పొద్దై
సమరానికి జంగ్‌ సైరన్‌లా ఊపిర్లు ఊదాడు
తన కలం, గళం తోటి కోట్ల హదయాలను
కొల్లగొట్టి జనం గుండెల్లో గూడు కట్టుకున్నాడు
గద్దరన్న అంటే ఒక పాటల నిఘంటువు
గద్దరన్న అంటే విప్లవాలకు వేగుచుక్క
గద్దరన్న అంటే అన్ని వర్గాలకు లైట్‌ హౌస్‌
పాట ఉన్నంత కాలం ప్రజల నాలుకలపై
నానుతూనే ఉంటాడు గద్దరన్న

– తాటిపాముల రమేశ్‌ (తార), 7981566031