వలసకార్మికులపై దాడి అంటూ తప్పుడు ప్రచారం

– తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిపై కేసు
చెన్నై : ఉత్తరభారతం నుంచి వచ్చి తమిళనాడులో పనిచేస్తున్న కార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కె.అన్నామలైపై చెన్నై సిటీ పోలీస్‌ సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ (సీసీబీ) ఆదివారం కేసు నమోదు చేసింది. మతం, జాతి, భాష ఆధారంగా రాష్ట్ర ప్రజలు, వలస కార్మికుల మధ్య శత్రుత్వం, ద్వేష భావం, ఘర్షణలు సృష్టించడానికి ప్రయత్నం చేసినందుకు అన్నామలైపై ఐపీసీలో నాలుగు సెక్షన్ల కింద సీసీబీ సైబర్‌ క్రైమ్‌ డివిజన్‌ కేసు నమోదు చేసినట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు తెలిపారు. వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ నకిలీ క్లిప్పింగ్‌లతో తప్పుడు కథనాలు ప్రసారం చేసినందుకు దైనిక్‌ భాస్కర్‌ ఎడిటర్‌, జర్నలిస్ట్‌ మహమ్మద్‌ తన్వీర్‌, బీజేపీ బాధ్యులు ప్రశాంత్‌ ఉమ్రావ్‌, సుగమ్‌ శుక్లాలపైనా తమిళనాడు పోలీసులు కేసులు నమోదు చేశారు. వలస కార్మికులపై అధికార డీఎంకే ఎంపీలు నీచమైన వ్యాఖ్యలు చేశారంటూ శనివారం అన్నామలై వివాదాస్పద ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే.