– ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్
కోపెన్‌హేగన్ : ప్రతిష్టాత్మక బిడబ్ల్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భారత స్టార్ షట్లర్లు హెచ్.ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్ విభాగంలో గత రెండు టోర్నీల్లో రాణించిన ప్రణరు.. ఈసారీ అదే జోరు కొనసాగించాడు. తొలి రౌండ్లో తొమ్మిదో సీడ్ హెచ్.ఎస్ ప్రణయ్ 24-22, 21-10తో వరుస గేముల్లో ఫిన్లాండ్ ఆటగాడు కాలె కొల్జెనెన్‌పై విజయం సాధించాడు. 43 నిమిషాల పాటు సాగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రణయ్కి తొలి గేమ్‌కు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఫిన్లాండ్ షట్లర్ ఆఖరు వరకు ప్రణయ్ని వెంబడించాడు. టైబ్రేకర్‌లో తొలి గేమ్ నెగ్గిన ప్రణయ్.. రెండో గేమ్‌ను సులువుగా గెల్చుకుని ముందంజ వేసింది. యువ షట్లర్, 11వ సీడ్ లక్ష్యసేన్ 21-11, 21-7తో తొలి రౌండ్లో ఏకపక్ష విజయం నమోదు చేశాడు. మారిషస్ షట్లర్ జార్జెస్ జులెన్ పాల్‌ను చిత్తుగా ఓడించిన లక్ష్యసేన్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ఇక మిక్స్‌డ్ డబుల్స్‌లో హైదరాబాదీ షట్లర్ సిక్కి రెడ్డి జంటకు చుక్కెదురైంది. తొలి రౌండ్లోనే స్కాట్లాండ్ జోడీ ఆడం హాల్, జులీల చేతిలో 14-21, 22-20, 18-21తో పరాజయం పాలైంది.