సెకండ్‌ ఏఎన్‌ఎంలను క్రమబద్ధీకరించాలి

– సీఎం కేసీఆర్‌కు కూనంనేని లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో పనిచేస్తున్న సెకండ్‌ ఏఎన్‌ఎంల సర్వీసులను క్రమబద్ధీకరించి వారికి న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు సోమవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో దాదాపు ఆరు రోజుల నుంచి 5,500 మంది సెకండ్‌ ఏఎన్‌ఎంలు, యూపీహెచ్‌సీ, ఏఎన్‌ఎంలు, ఈసీఏఎన్‌ఎంలు వంటి వివిధ పేర్లతో పిలవబడుతున్న కాంట్రాక్టు ఏఎన్‌ఎంలు సమ్మె చేస్తున్నారని వివరించారు. వారందరూ గత 16 ఏండ్లకు పైబడి విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వారు జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) ద్వారా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, మెరిట్‌, ధ్రువపత్రాల పరిశీలనతో ఎన్నికయ్యారని పేర్కొన్నారు. ఎన్‌హెచ్‌ఎమ్‌ పథకంలో పనిచేస్తున్న సిబ్బందిని దేశంలోని అనేక రాష్ట్రాల్లో వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేయడం, పక్కనున్న ఏపీలో శాఖాపరమైన పరీక్ష ద్వారా కొత్తగా పోస్టులను సృష్టించి కాంట్రాక్టు ఏఎన్‌ఎంలను క్రమబద్ధీకరించారని తెలిపారు.