శాంతిని నెలకొల్పండి

– 25న మణిపూర్‌ ఆదివాసీలకు సంఘీభావ కార్యక్రమాలను జయప్రదం చేయాలి : సీపీఐ, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీల విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మణిపూర్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని సీపీఐ, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీలు ఆందోళన వ్యక్తం చేశాయి. అక్కడ శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు సీపీఐ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కుకీ తెగకు చెందిన ఆదివాసీ మహిళలను ఇద్దరిని నగంగా ఊరేగించి, సామూహిక లైంగికదాడి చేసి, హత్య చేయడం సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 25న ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మణిపూర్‌ ఆదివాసీలకు సంఘీభావ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. రెండు పార్టీల సభ్యులు, ప్రజాసంఘాలు, వామపక్ష శ్రేయోభిలాషులు, ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. మణిపూర్‌ జనాభాలో 54 శాతానికి పైగా ఉన్న మైతీ కులస్తులకు, కుకీ, నాగ గిరిజన తెగల మధ్య బీజేపీ తన రాజకీయ లబ్దికోసం చిచ్చుపెట్టిందని విమర్శించారు. గిరిజన చట్టాలను అతిక్రమించి మైతీలను గిరిజనులుగా మార్చడానికి ఒడిగట్టిందని తెలిపారు. ఆదివాసీలను అడవుల నుంచి దూరంచేస్తున్నదని పేర్కొన్నారు. దీన్ని ప్రతిఘటించిన కుకీ, నాగ తెగలపై మతోన్మాదశక్తులు బీజేపీ అండతో రెండున్నర నెలలుగా తీవ్రమైన దాడులకు తెగబడుతున్నాయని వివరించారు. గృహ దహనాలు, చర్చీలతోపాటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయని తెలిపారు. ఈ హింసాత్మక ఘటనలకు కేంద్ర, మణిపూర్‌ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలు బాధ్యత వహించి దోషులను శిక్షించాలనీ, బాధితులకు న్యాయం చేయాలనీ, అక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పాలని తమ్మినేని, కూనంనేని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.

Spread the love