గుజరాత్‌ హైకోర్టులో ఏం జరుగుతోంది ?

Gujarat High Court What is going on?– సుప్రీం ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేస్తారా?
– తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సుప్రీం బెంచ్‌
– బాధితురాలి అబార్షన్‌కు అనుమతి
న్యూఢిల్లీ : తన 27వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి అనుమతి కోరుతూ లైంగికదాడి బాధితురాలు పెట్టుకున్న పిటిషన్‌పై గుజరాత్‌ హైకోర్టు వ్యవహరించిన తీరు పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసింది. ఈ కేసు విషయంలో తమ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఎలా వ్యవహరిస్తారంటూ గుజరాత్‌ హైకోర్టును ప్రశ్నించింది. బాధిత మహిళ మానసిక వేదన, వైద్య నివేదికలను పరిగణనలోకి తీసుకుని ఆమె తన 27 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. సుప్రీంకోర్టు ధర్మాసనం సమావేశమైన వెంటనే, గుజరాత్‌ హైకోర్టు ఈ కేసును తనకు తానుగా పరిగణనలోకి తీసుకుని సోమవారం విచారణ చేపట్టి, ఆ మహిళ పిటిషన్‌ను కొట్టివేసిందని న్యాయవాదులు తెలియజేశారు. దానిపై జస్టిస్‌ నాగరత్న, జస్టిస్‌ భుయాన్‌లతో కూడిన బెంచ్‌ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. తోసిపుచ్చిన పిటిషన్‌ను తిరిగి విచారణకు స్వీకరించాల్సిన అవసరమేం వచ్చిందని జస్టిస్‌ నాగరత్న ప్రశ్నించారు. అది కూడా సుప్రీం విచారణ ముగిసిన వెంటనే ఎందుకు చేపట్టాల్సి వచ్చిందన్నారు. ‘అసలు గుజరాత్‌ హైకోర్టులో ఏం జరుగుతోంది? అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులకు వ్యతిరేకంగా దేశంలో ఏ న్యాయస్థానమూ కూడా ఆదేశాలు జారీ చేయరాదు. ఇది రాజ్యాంగ సూత్రాలకే విరుద్ధం’ అని నాగరత్న వ్యాఖ్యానించారు. తొలుత బాధితురాలి పిటిషన్‌ను విచారించేందుకు శనివారం ప్రత్యేకంగా సమావేశమైన సుప్రీంకోర్టు బెంచ్‌, గుజరాత్‌ హైకోర్టు తీరును తప్పుబట్టింది. అబార్షన్‌ కోసం ఆమె చేస్తున్న పోరాటాన్ని పట్టించుకోకుండా 12రోజుల పాటు కేసును వాయిదా వేయడాన్ని ప్రశ్నించింది. విలువైన సమయాన్ని ఎందుకు వృథా చేశారని ప్రశ్నించింది. తక్షణమే ఆమెకు వైద్య పరీక్షలు జరపాల్సిందిగా ఆదేశించింది. తదుపరి విచారణకు సోమవారానికి కేసును వాయిదా వేసింది. శనివారం సుప్రీం విచారణ ముగిసిన వెంటనే సమావేశమైన గుజరాత్‌ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. పైగా తన బిడ్డ ప్రభుత్వ సంరక్షణలో పెరగడానికి ఆమె సుముఖంగా వుందా? లేదా? అన్న అభిప్రాయం తెలుసుకునేందుకే ఈ కేసును వాయిదా వేశారంటూ వివరణ ఇచ్చారని న్యాయవాదులు సుప్రీం బెంచ్‌కు తెలియజేశారు. ఆ విషయమై బెంచ్‌ మరింత కలత చెందింది. అత్యాచార బాధితురాలిపై ఇటువంటి అన్యాయమైన షరతులను కొనసాగించరాదని జస్టిస్‌ భుయాన్‌ వ్యాఖ్యానించారు.
లైంగికదాడి వల్ల గర్భం దాల్చడం మాన్పలేని గాయం !
లైంగికదాడి వల్ల గర్భం దాల్చాల్సి రావడం బాధితురాలికి కోలుకోలేని గాయం వంటిదేనని, అది తీవ్ర మనోవేదనకు గురిచేస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘వివాహ వ్యవస్థలో ఒక మహిళ తల్లవడం అనేది అందరికీ అత్యంత సంతోషకరమైన విషయమే కానీ, వివాహ బంధానికి వెలుపల తన సమ్మతి లేకుండా ఇలా గర్భం దాల్చడం అనేది ఆ మహిళ శారీరక, మానసిక ఆరోగ్యానికి అత్యంత హానికరం. లైంగిక దాడిని ఎదుర్కోవడమే అత్యంత బాధాకరమంటే, దాని ఫలితంగా గర్భం దాల్చడమన్నది కోలుకోలేని గాయమే అవుతుంది” అని బెంచ్‌ వ్యాఖ్యానించింది. బాధితురాలు మంగళవారమే ఆసుపత్రిలో చేరాలని ఆదేశించింది. అబార్షన్‌ సమయంలో పిండం సజీవంగా వున్నట్తైతే వెంటనే ఇంక్యుబేషన్‌లో పెట్టి సంరక్షించాలని సూచించింది. ఆ తర్వాత చట్టప్రకారం ఆ చిన్నారి సంరక్షణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలని ఆదేశించింది.