కీలకాంశాలపై బ్రిక్స్‌ దృష్టి నేటి నుంచి బ్రిక్స్‌ సమావేశాలు

BRICS focus on key issues BRICS meetings from today– దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో సమ్మిట్‌
– 15వ శిఖరాగ్ర సమావేశంపై ప్రపంచం ఆసక్తి
– కోవిడ్‌ అనంతరం ఇదే తొలి సమావేశం
– పలు విషయాలు, సమస్యలపై చర్చలు జరిగే అవకాశం:
అంతర్జాతీయ నిపుణులు, విశ్లేషకుల అంచనా
న్యూఢిల్లీ : నేటి నుంచి దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో బ్రిక్స్‌ దేశాల 15వ శిఖరాగ్ర సమావేశం జరగనున్నది. ఈనెల 24 వరకు ఇది కొనసాగనున్నది. కోవిడ్‌ మహమ్మారి అనంతరం సభ్య దేశాల తొలి సమావేశం ఇదే. దీంతో ఈ శిఖరాగ్ర సదస్సు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నది. ఇటు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ఆతిథ్యం ఇవ్వకూడద ని దక్షిణాఫ్రికా తీవ్ర దేశీయ, అంతర్జాతీయ ఒత్తిడికి గురైంది. అయితే, జులై 19న పుతిన్‌ సమ్మిట్‌కు హాజరుకావడం లేదని ప్రకటించడంతో దక్షిణాఫ్రికా దౌత్యపరమైన చిక్కుల నుంచి బయటపడింది.
జీ7 దేశాలను అధిగమించిన బ్రిక్స్‌ జీడీపీ
బ్రిక్స్‌ ప్రపంచ ఆర్థిక పాలనలో పెరుగుతున్న పలుకుబడితో ఒక ముఖ్యమైన సమూహంగా ఉద్భవించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తనదైన ప్రభావాన్ని చూపుతున్నది. ప్రపంచ జీడీపీలో 31.5 శాతంతో ఐదు బ్రిక్స్‌ దేశాలు బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికాలు కలిసి 30.7 శాతం వద్ద ఉన్న జీ7 దేశాల జీడీపీ సహకారాన్ని అధిగమించటం గమనార్హం. మహమ్మారి అనంతర ప్రపంచంలో, ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం, పాశ్చాత్య ఆర్థిక ఆంక్షలు, అమెరికా, చైనా దేశాల మధ్య పెరిగిన విరోధాలు, రష్యాతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ‘స్విఫ్ట్‌ పరిమితులు, ఆర్థిక మందగమనంతో పాటు ఇతర కారణాలతో విధానపర చర్చలు వేడెక్కాయని అంతర్జాతీయ విశ్లేషకులు తెలిపారు.
కొత్త సభ్యులు, కొత్త పాలన, కొత్త కరెన్సీ గురించి చర్చలకు అవకాశం
న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌(ఎన్‌డీబీ.. కొన్నిసార్లు బ్రిక్స్‌ బ్యాంక్‌ అని పిలుస్తారు) బ్రిక్స్‌ రాజకీయ సమూహానికి ఒక నిర్దిష్ట విజయంగా నిస్సందేహంగా ఉన్నది. అభివద్ధి చెందుతున్న దేశాలలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ఫైనాన్సింగ్‌ను ప్రోత్సహించడానికి ఎన్‌బీడీ స్థాపించబడింది. ఆ తర్వాత అది విస్తరించింది. ఇప్పటికే ఉన్న పలు అభివద్ధి సంస్థలను సవాలు చేసేలా ఉన్నదని విశ్లేషకులు తెలుపుతున్నారు. మౌలిక సదుపాయాలు, స్థిరమైన అభివృద్ధి ప్రాజెక్టుల కోసం వనరులను సమీకరించడం ఎన్‌డీబీ యొక్క ఆదేశం. బ్రిక్స్‌ ఐదు సభ్య దేశాలు ఒకరికొకరు స్థానిక కరెన్సీలో క్రెడిట్‌ సౌకర్యాలను విస్తరించడానికి అంగీకరించాయి. అయితే గ్లోబల్‌ ట్రేడ్‌లో యూఎస్‌ డాలర్‌ ప్రస్తుత మూల కరెన్సీ అయినందున ఇది అంత సులభం కాదని నిపుణులు అంటున్నార. ఎన్‌డీబీ ఫైనాన్సింగ్‌ ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల నుంచి వస్తుంది. అయితే ఎన్‌డీబీ భవిష్యత్తులో సున్నితమైన, సంక్లిష్టమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపడుతుందా అనేది కీలక ప్రశ్న అని విశ్లేషకులు అన్నారు.
కొత్త కరెన్సీపై..
బంగారంతో కూడిన కరెన్సీ గురించి ఊహాగానా లు ఉన్నాయి. కానీ డి-డాలరైజేషన్‌ గురించి చర్చలు కొత్త కాదు. గతంలో కూడా బ్రిక్స్‌ ప్రపంచ రిజర్వ్‌ కరెన్సీ ఆలోచన చేసింది. కొత్త కరెన్సీకి విస్తృతమైన చర్చలు, మార్పిడి రేట్లు, చెల్లింపు వ్యవస్థలు, ఆర్థిక మార్కెట్‌ నియంత్రణ కోసం యంత్రాంగాల ఏర్పాటు అవసరం. రాబోయే బ్రిక్స్‌ సమ్మిట్‌లో సీమాంతర వాణిజ్యం కోసం దీర్ఘకాలిక ఇంటిగ్రేటెడ్‌ పేమెంట్‌ సిస్టమ్‌కు సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉన్నదని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేశారు.
బ్రిక్స్‌లో చేరటానికి ఇతర దేశాల ఆసక్తి
ఇటు బ్రిక్స్‌లో చేరటానికి అనేక దేశాలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. 23 దేశాలు సమూహంలో చేరాల నే కోరికను వ్యక్తం చేయడంతో బ్రిక్స్‌ విస్తరణ అనేది మీడియా దృష్టిని చాలా ఆకర్షించే అంశం. ప్ర స్తుత మందగమనం ఉన్నప్పటికీ, చైనా నేడు ప్రపం చంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, కొనుగోలు శక్తి సమాన త్వం(పీపీపీ) ప్రాతిపదికన మొదటిది. ప్రపంచంలోని అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా సౌదీ అరేబియా యొక్క ప్రత్యేక ప్రాముఖ్యత కారణం గా బహుశా దాని చేరిక జరిగే అవకాశం ఉండొచ్చని విశ్లేషకులు తెలిపారు. దీంతో బ్రిక్స్‌లోకి ఇతర దేశాల ను చేర్చుకో వటం పైనా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నదని అంతర్జాతీయ నిపుణులు తెలుపుతున్నారు.
‘పశ్చిమం’తో సమస్యలపై చర్చ
బ్రిక్స్‌ దేశాల అంతర్జాతీయ సంబంధాలను, ముఖ్యంగా పశ్చిమ దేశాలతో వారి తరచుగా సమస్యాత్మక సంబంధాలను చర్చించడానికి ప్రస్తుత పరిస్థితి అనువైన సమయం. అయితే, దీనికి ముందు, బ్రిక్స్‌ దేశాల మధ్యనే ఏవైనా అంతర్గత సమ స్యలు ఉంటే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు, విశ్లేషకులు అన్నారు. సభ్య దేశా లు ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, శ్రేయస్సు లక్ష్యాలు వంటి వి బ్రిక్స్‌ దేశాలు కొనసాగించాలని సూచించారు.