బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల పక్షపాతి: ఎంపీపీ దశరథ్ రెడ్డి

 నవతెలంగాణ- రామారెడ్డి
తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ ఫలాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో నిలిచిపోయిందని, కెసిఆర్ ప్రభుత్వం ప్రజల పక్షపాతి అని మంగళవారం స్థానిక ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు సంబంధించిన 30 కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా దశరథ్ రెడ్డి మాట్లాడుతూ… గత ప్రభుత్వాలు 50 సంవత్సరాల నుండి చేయని పనులను, కెసిఆర్ ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, ఎండాకాలంలో నీటి కోసం ఆడవాళ్లు కొట్టుకునే బాధ మిషన్ భగీరథ నీటితో పోయిందని, కల్యాణ లక్ష్మితో పేదింటి ఆడపడుచులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని అన్నారు. రైతుల కోసం రైతు బీమా, రైతుబంధు, రైతు వేదికలు, దళితులకు దళిత బంధు, మైనార్టీలకు మైనార్టీ బందు, బీసీలకు బీసీ బందుతో ప్రభుత్వం తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్తుందని, బంగారు తెలంగాణ అంటే ప్రజలు అభివృద్ధి చెందడమే నని అన్నారు.
 మళ్లీ వచ్చే ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ ను భారీ మెజార్టీతో గెలుపొందించాలని అన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్ రోజా, వైస్ ఎంపీపీ రవీందర్రావు, రైతుబంధు మండల అధ్యక్షులు నారాయణరెడ్డి, ప్రజా ప్రతినిధులు రాజేందర్, ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు రంగు రవీందర్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.