ప్రతి గ్రామానికో కెసిఆర్‌ స్పోర్ట్స్‌ కిట్‌

– ఏర్పాట్లు పూర్తి చేసిన శాట్స్‌ యంత్రాంగం
– మున్సిపల్‌ వార్డుకు సైతం ఓ కిట్‌ అందజేత
– 25 వేల క్రీడా కిట్ల పంపిణీకి రంగం సిద్ధం
నవతెలంగాణ-హైదరాబాద్‌ 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించటం, గ్రామీణ క్రీడలకు తోడ్పాటు అందించటమే లక్ష్యంగా ఇప్పటికే సుమారు 18 వేల క్రీడా ప్రాంగణాలు నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా మరో అడుగు ముందుకేస్తోంది. ప్రతి గ్రామానికి, ప్రతి మున్సిపల్‌ వార్డుకు ఓ సమగ్ర స్పోర్ట్స్‌ కిట్‌ అందించేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రతి క్రీడా ప్రాంగణానికి ఓ స్పోర్ట్స్‌ కిట్‌ను అందించేందుకు శాట్స్‌ యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ‘కెసిఆర్‌ స్పోర్ట్స్‌ కిట్లను’ పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొం దిస్తున్నారు.
సహజంగా స్పోర్ట్స్‌ కిట్‌ అనగానే మనకు క్రికెట్‌ కిట్‌ ఒక్కటే గుర్తుకొస్తుంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు యువతకు క్రికెట్‌ కిట్లను పంపిణీ చేయటం సర్వ సాధారణం. కానీ రాష్ట్ర ప్రభుత్వమే ఈ స్థాయిలో సమగ్ర స్పోర్ట్స్‌ కిట్‌ను అందించటం ఇదే ప్రథమం కానుంది. 23 క్రీడా పరికరాలు, సామాగ్రితో కూడిన సమగ్ర కెసిఆర్‌ స్పోర్ట్స్‌ కిట్‌ను డిజైన్‌ చేశారు. కాశ్మీర్‌ విల్లోతో చేసిన రెండు క్రికెట్‌ బ్యాట్లు, వికెట్‌ కీపింగ్‌కు లెదర్‌తో చేసిన గ్లోవ్స్‌, ఫోమ్‌/కాటన్‌తో తయారు చేసిన బ్యాటింగ్‌ గ్లోవ్స్‌, ఆరు క్రికెట్‌ బంతులు సహా 12 రకాల వస్తువులు క్రికెట్‌ కిట్‌లో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆదరణ ఎక్కువగా ఉండే వాలీబాల్‌కు సంబం ధించి.. నాలుగు సింథటిక్‌ వాలీబాల్స్‌, రెండు వాలీబాల్‌ నెట్స్‌, ఓ సైకిల్‌ పంప్‌ను అందిస్తున్నారు. జిమ్‌కు సంబంధించి 2.5 కేజీలు, 5 కేజీలు, 7.5 కేజీల డంబుల్స్‌ సెట్‌ (30 కేజీలు) ఉన్నాయి. డిస్కస్‌ త్రో (1, 2 కేజీలు), ఆరు టెన్నికాయిట్‌ రింగ్స్‌, నాలుగు స్కిప్పింగ్‌ రోప్స్‌, ఓ విజల్‌ సహా స్టాప్‌ వాచ్‌ను కిట్‌లో పొందుపరిచారు.
ప్రతి కిట్‌లో 75 టీ షర్ట్‌లు
కెసిఆర్‌ స్పోర్ట్స్‌ కిట్‌లో ప్రత్యేకం 75 టీ షర్ట్‌లు. క్రికెట్‌, వాలీబాల్‌, సహా ఇతర క్రీడలకు సంబంధించిన క్రీడా సామాగ్రిని అందిస్తున్న శాట్స్‌.. ప్రతి గ్రామానికి 75 టీషర్టులు ఇవ్వనుంది. సీఎం కెసిఆర్‌, రాష్ట్ర ప్రభుత్వం లోగోలతో కూడిన ఫోటోలను స్పోర్ట్స్‌ కిట్‌, టీ షర్ట్‌లపై ముద్రించారు!. కబడ్డీ, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, అథ్లెటిక్స్‌ సహా ఇతర క్రీడల్లో ఆసక్తి కలిగిన యువతకు ఈ టీ షర్ట్‌లు పంపిణీ చేయనున్నారు. మండల కేంద్రంలో జరిగే కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడి చేతుల మీదుగా కెసిఆర్‌ స్పోర్ట్స్‌ కిట్‌, టీ షర్ట్‌లు పంపిణీ చేసేందుకు శాట్స్‌ అధికారులు ప్రణాళికలు రచిసు ్తన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు అన్ని గ్రామాలు, మున్సిపల్‌ వార్డుల్లో ఈ స్పోర్ట్స్‌ కిట్స్‌ను అందజేయనున్నారు.
దేశ చరిత్రలో ప్రథమం!
ప్రతి గ్రామానికి, మున్సిపల్‌ వార్డుకు ఓ సమగ్ర స్పోర్ట్స్‌ కిట్‌ను రాష్ట్ర ప్రభుత్వమే అందించటం దేశ చరిత్రలోనే ఇదే ప్రథమం. సీఎం కప్‌ పోటీలతో గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీశాం. ఇప్పుడు ప్రతి గ్రామానికి కెసిఆర్‌ స్పోర్ట్స్‌ కిట్‌ అందజేసి.. గ్రామీణ క్రీడలకు పూర్వ వైభవం తీసుకురానున్నాం. క్రీడా రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలుపటమే సిఎం కెసిఆర్‌ లక్ష్యం. అందుకు అనుగుణంగా గుణాత్మక పురోగతి సాధించేందుకు శాట్స్‌ కృషి చేస్తుంది’
– డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌, శాట్స్‌ చైర్మెన్‌