– బెంచ్ ఆటగాళ్లకు నేడు చాన్స్?
– 3-0 విజయంపై భారత్ గురి
– నేడు ఐర్లాండ్‌తో మూడో టీ20
– రాత్రి 7.30 నుంచి స్పోర్ట్స్18లో..
ఐర్లాండ్ పర్యటన లక్ష్యం సిద్ధించింది!. బుమ్రా, ప్రసిద్ కృష్ణలు ఫిట్నెస్తో పాటు ఫామ్ నిరూపించుకున్నారు. సిరీస్ సైతం 2-0తో భారత్ సొంతమైంది. దీంతో నామమాత్రపు మూడో టీ20లో బెంచ్ ఆటగాళ్లను ప్రయోగించేందుకు సిద్ధమవుతుంది. జితేశ్, షాబాజ్, అవేశ్లు నేడు చివరి మ్యాచ్‌లో తుది జట్టులో నిలిచే అవకాశం కనిపిస్తుంది. భారత్, ఐర్లాండ్ మూడో టీ20 నేడు
కొత్త వాళ్లకు అవకాశం
ఐర్లాండ్ పర్యటనలో అవకాశం కోసం ఎదురుచూస్తున్న ముగ్గురు క్రికెటర్లకు నేడు అవకాశం దక్కే వీలుంది. రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ రెండో టీ20లో రాణించారు. ఆసియా కప్ నేపథ్యంలో తిలక్ వర్మ, సంజు శాంసన్‌లకు అవకాశాలు కొనసాగించ నున్నారు. అయినా, వికెట్ కీపర్ బ్యాటర్‌గా జితేశ్ శర్మను ఆడించే ఆలోచనను కొట్టిపారేయలేం. తొలి బంతి నుంచే ఎదురుదాడి చేయగల జితేశ్‌కూ ఓ చాన్స్ ఇవ్వాలనే వాదన వినిపిస్తోంది. ఇక వాషింగ్టన్ సుందర్ జాతీయ జట్టులో తనేంటో నిరూపించుకున్నాడు. గాయాలే అతడి కెరీర్‌ను కాస్త వెనక్కి నెట్టాయి. అతడి స్థానంలో షాబాజ్ అహ్మద్ నేడు తుది జట్టులో నిలువనున్నాడు. బౌలింగ్ విభాగంలో అవేశ్ ఖాన్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అర్షదీప్ సింగ్‌కు విశ్రాంతి అందించి.. అవేశ్ ఖాన్‌ను ఆడించనున్నారు. 3-0 విజయంపై కన్నేసిన బుమ్రా సేన.. ఎటువంటి మార్పులు లేకుండానే మూడో టీ20లో బరిలో దిగినా ఆశ్చర్యం లేదు. యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, శివం దూబె, రింకూ సింగ్‌లు మెరుపు ఇన్నింగ్స్‌లు నమోదు చేయాలని చూస్తున్నారు.
బోణీ కొడతారా?
ఐర్లాండ్ ఇప్పటి వరకు భారత్‌పై నెగ్గలేదు. డబ్లిన్‌లోనూ టీమ్ ఇండియాకు తిరుగులేని రికార్డుంది. అయితే, తొలి రెండు టీ20ల్లో ఐర్లాండ్ ఓడినా.. ఆతిథ్య జట్టు ఆకట్టుకునే ప్రదర్శనే చేసింది. మరీ తీసికట్టుగా ఆడలేదు. ఆండీ బల్బిర్నె, బారీ మెక్‌కార్టీ, మార్క్ ఎడెర్ సమా లార్కాన్ టక్కర్, పాల్ స్టిర్లింగ్లు ప్రతిభావంతులైన బ్యాటర్లు. నాణ్యమైన భారత బౌలర్లపై సమిష్టిగా రాణించేందుకు ఐర్లాండ్ తడబడుతోంది. బ్యాటింగ్ లైనప్‌లో సమిష్టితత్వం చూపితే టీమ్ ఇండియాకు చివరి మ్యాచ్‌లో ఇబ్బందులు తప్పవు. బంతితోనూ ఐర్లాండ్ మంచిగానే కనిపిస్తుంది. జోశ్ లిటిల్, క్రెయిగ్ యంగ్, బెన్ వైట్లు మనోళ్లకు సవాల్ విసురుతున్నారు. అంత సులువుగా పరుగులు ఇవ్వటం లేదు. ఊరట విజయం వేటలో ఐర్లాండ్ నేడు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉంది.
వర్షం సూచన
భారత్, ఐర్లాండ్ మూడో టీ20కి వర్షం ముప్పు పొంచి ఉంది. బుధవారం కాస్త ఎండ, కాస్త మేఘావృత వాతావరణం ఉండనుంది. సాయంత్రం సమయంలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 3 గంటలకే మ్యాచ్ ఆరంభం కానుండగా.. మ్యాచ్‌పై ప్రభావం తక్కువనే అంటున్నారు. టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోనుంది!.
తుది జట్లు (అంచనా)
భారత్ : యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్/జితేశ్ శర్మ (వికెట్ కీపర్), శివం దూబె, వాషింగ్టన్ సుందర్/షాబాజ్ అహ్మద్, అర్షదీప్ సింగ్/అవేశ్ ఖాన్, రవి బిష్ణోరు, జశ్‌ప్రీత్ బుమ్రా (కెప్టెన్), ప్రసిద్ కృష్ణ.
ఐర్లాండ్ : పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండీ బాల్బిర్నె, లార్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టీస్ కాంపెర్, జార్జ్ డాక్రెల్, మార్క్ ఎడెర్, బారీ మెక్‌కార్టీ, క్రెయింగ్ యంగ్, జోశ్ లిటిల్, బెన్ వైట్.