దివ్యాంగులకు 4016 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ 

– ఎవరూ అడగకున్నా బీడీ టేకేదారులకు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
– సబ్బండవర్ణాల ప్రజలందరికీ సముచిత న్యాయం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
– జడ్పీ చైర్ పర్సన్  అరుణ
– దివ్యాంగుడికి చెక్కు అందిస్తున్న జడ్పీ చైర్ పర్సన్ అరుణ మున్సిపల్ చైర్ పర్సన్ కళా
నవతెలంగాణ -సిరిసిల్ల రూరల్
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సబ్బండవర్ణాల ప్రజలందరికీ సముచిత న్యాయం కల్పించడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతుందని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి పేర్కొన్నారు.బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సిరిసిల్ల నియోజవర్గం పరిధిలోని దివ్యాంగులకు 3,016 నుండి 4,016 రూపాయలకు పెంచిన మంజూరు పత్రాలను, బీడీ టేకేదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేసే కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ  ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మాట్లాడుతూ దివ్యాంగులు చిన్నబుచ్చుకోకుండా, సమాజంలో గౌరవంగా బ్రతికే విధంగా పెన్షన్ రూపంలో ఆర్థిక సహాయం అందజేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని అన్నారు.  ఒకప్పుడు దివ్యాంగులకు 500 రూపాయల పెన్షన్ ను 3,016 రూపాయలకు, ప్రస్తుతం 4,016 రూపాయలకు పెంచడం గొప్ప విషయమని అన్నారు. ప్రభుత్వం అందించే పథకాలతో దివ్యాంగులు కూడా గర్వంగా బ్రతికేలా పెద్ద మొత్తంలో  ప్రతీ నెలా పెన్షన్ ను అందజేస్తుందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 11,968 మంది దివ్యాంగులు 4,016 పెన్షన్ ను, 386 మంది బీడీ టేకేదారులు 2,106 రూపాయల పెన్షన్ ను అందుకోనున్నారని ఆమె తెలిపారు. రాష్ట్ర పవర్ లూమ్, టెక్స్ టైల్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్ మాట్లాడుతూ రూ. 500 ఉన్న పెన్షన్ 4,016 రూపాయలకు పెరిగింది అంటే కేసీఆర్ వల్లే అని అన్నారు. దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ అందించి ఆదుకునే ప్రభుత్వం లేదని పేర్కొన్నారు. రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి కేసీఆర్ అని, ఆయన చేసే ప్రతీ ఆలోచన ప్రజల అభివృద్ధి, శ్రేయస్సు కోసమేనని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులను, నేతన్నలను, గీతన్నలను, దళితులను, అన్ని రకాల కులవృత్తుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పాటు పడుతుందని తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా  మాట్లాడుతూ దివ్యాంగులు అవిటితనంతో పడుతున్న బాధలు తీర్చేలా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అందిస్తుందని, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు, జెడ్పీటీసీ చీటీ లక్ష్మన్ రావు, ఎంపీపీలు పడిగెల మానస, పిల్లి రేణుక, జెడ్పీ సీఈఓ గౌతం రెడ్డి, పెన్షన్ ఏపీఓ పాపారావు, తదితరులు పాల్గొన్నారు.