మాస్కులు ధరించండి

– పల్మోనాలజిస్ట్‌ డాక్టర్‌ రాజీవ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలనీ, కరచాలనం వంటి వాటికి సాధ్యమైనంత మేరకు దూరంగా ఉండాలని హైదరాబాద్‌ ఎర్రగడ్డలోని ప్రభుత్వ చెస్ట్‌ ఆస్పత్రి కన్సల్టెంట్‌ పల్మోనాలజిస్ట్‌ డాక్టర్‌ రాజీవ్‌ సూచించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న జ్వర బాధితుల్లో ప్రతి నలుగురిలో ఒకరికి నిరంతరం దగ్గు, జ్వరం, శ్వాసకోశ సమస్యలకు హెచ్‌3 ఎన్‌2 వైరస్‌ కారణమని ఐసీఎంఆర్‌ గుర్తించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించాలనీ, కరచాలనం, ఆలింగనం వంటి వాటికి దూరంగా ఉండాలని కోరారు. యాంటీ బయాటిక్స్‌ వాడకుండా రోగలక్షణాల మేరకు చికిత్స తీసుకోవాలని తెలిపారు. కోవిడ్‌ సమయంలో అజిత్రోమైసిన్‌ ఐవర్‌ మెక్టిన్‌ ఎక్కువగా వాడటం ప్రతికూల పరిస్థితులకు దారి తీసిందని చెప్పారు. దగ్గు, వికారం, వాంతులు, గొంతు మంట, శరీర నొప్పి, అతిసారం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. తరచుగా ముక్కును, నోటిని తాకడం మానేయాలని, దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ముక్కును, నోటిని కప్పుకోవాలని, ఎక్కువగా ద్రవాలు తీసుకోవాలని, జ్వరం, శరీర నొప్పి విషయంలో పారాసెటమాల్‌ తీసుకోవాలని, బహిరంగంగా ఉమ్మేయడం మానేయాలనీ, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యున్ని సంప్రదించాలని సూచించారు.