సుప్రీం కోర్టు ప్రజాకేంద్రీకృత న్యాయస్థానం

– సిజెఐ జస్టిస్‌ డివై చంద్రచూడ్‌
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు దాని వైవిధ్యాన్ని బట్టి వాస్తవానికి ప్రజల కేంద్రీకృత న్యాయస్థానం అని ఆ కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ అన్నారు. సుప్రీంకోర్టులో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌కు చెందిన న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం హర్యానాకు సంబంధించిన అంశంపై నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు. ప్రజలు న్యాయవ్యవస్థను విశ్వసిస్తారని, న్యాయమూర్తులు నియామకాలు సుప్రీం కోర్టుకు వైవిధ్యాన్ని తెచ్చిపెట్టాయని పేర్కొన్నారు. కొత్తగా నియమితులైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ భట్టిలకు సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ (ఎస్‌సిబిఎ) సన్మాన కార్యక్రమంలో సిజెఐ జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ మాట్లాడారు. భాష, కులం, మతం, గుర్తింపుతో సంబంధం లేకుండా బార్‌ సభ్యుల మధ్య సంఘీభావ ప్రాముఖ్యతను ప్రదర్శించడానికి బార్‌ నిర్వహించే ఇటువంటి కార్యక్రమాలు చాలా కీలకమని అన్నారు.