ధరల పతనంతో ఉల్లి పంటకు నిప్పు

నాసిక్‌ : ఉల్లి ధరల పతనంతో కృంగిపోయిన మహారాష్ట్రలో నాసిక్‌ జిల్లాలోని ఒక రైతు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, సాగుదారుల కష్టాలను ఎత్తిచూపుతూ తన పంటకు నిప్పు పెట్టాడు. భోగి మంటలతో హోళికా పండుగ నిర్వహించుకునే రోజున ఈ మహారాష్ట్రలో రైతు ఈ విధంగా నిరసన వ్యక్తం చేశాడు. పంటకు నిప్పు పెట్టి ఆందోళన చేశాడు. ఈ ఆందోళ నకు ఆహ్వాన పత్రాన్ని కూడా ముద్రించాడు. ఇందుకు సంబంధించిన వీడి యోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. జిల్లాలోని యోలా తాలుకాలోని మథుల్తాన్‌ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన రైతు కృష్ణ డోంగ్రే తన ఒకటిన్నర ఎకరం పొలంలో పండించిన పంటకు నిప్పు పెట్టాడు. ఈ నిరసనలో సమీప గ్రామాలకు చెందిన రైతులు కూడా పాల్గొన్నారు. ఃకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను వారి కర్మకు వదిలివేశాయి. తమ అధికార పోరులో పడి రైతు బతుకున్నాడా.. అనే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. ఇది మహారాష్ట్రకే కాదు దేశానికి కూడా బ్లాక్‌ డే. ఉల్లి మంటలను వెలిగించాల్సి వచ్చిందిః అని కృష్ణ డోంగ్రే తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు విమర్శించారు. ఆసియాలోనే అతి పెద్ద హోల్‌సేల్‌ ఉల్లి మార్కెట్‌గా పేరుగాంచిన నాసిక్‌లో లాసల్‌గావ్‌లోని అగ్రికల్చర్‌ ప్రొడ్యూస్‌ మార్కెట్‌ కమిటీ (ఎపిఎంసి)లో ఉల్లి ధర తీవ్రంగా క్షీణించింది. ఇక్కడ కేజీ ఉల్లి ధర రూ 2గా ఉంది. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు ఒక రోజు పాటు వేలం పాటను కూడా నిలిపివేశారు. ఉల్లి పంటలకు ధరలు క్షీణిస్తుండటంతో నాసిక్‌ జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలో రైతులు కూడా ఆందోళనలకు దిగుతున్నారు. గతవారంలో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఈ ఆందోళనలు కొనసాగాయి. ఆదివారం నాసిక్‌ జిల్లాలోని నిఫాద్‌ తాలుకాలోని శిరస్‌గావ్‌లో కేంద్ర మంత్రి భారతి పవార్‌ను రైతులు ఘెరావ్‌ కూడా చేశారు. ఉల్లి ఎగుమతులు పెంచామని కేంద్రం గొప్పలు చెబుతున్నా ఉల్లి పంటకు మంచి ధర ఎందుకు రావడం లేదని మంత్రిని రైతులు ప్రశ్నించారు. క్వింటాల్‌ ఉల్లికి కనీసం రూ. 1,500 మద్దతు ధరను తక్షణమే కేంద్రం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.