– ముస్లిం బోర్డును కోరిన లా కమిషన్
న్యూఢిల్లీ : వివాహానికి సంబంధించిన రెండు వివాదాస్పద రూపాలైన నికాహ్ హలాలా, ముటాపై వైఖరిని నిస్సందేహంగా తెలియచేయాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఎఐఎంపిఎల్‌బి)ను లా కమిషన్ కోరింది. అలాగే వివాహానికి కనీస వయస్సు గురించి ఇస్లామిక్ చట్టంలో ఉన్న వివరణను కూడా కమిషన్ కోరింది.
ఈ మేరకు ఎఐఎంపిఎల్‌బి అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహ్మానీ నేతృత్వంలోని 11 మంది సభ్యుల ప్రతినిధి బృందంతో లా కమిషన్ చైర్మన్ జస్టిస్ (రిటైర్డ్) రీతు రాజ్ అవస్తీ రెండు గంటలపాటు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. కొన్ని ఈ ప్రశ్నలను సంధించారు.
నికాహలాలా, ముటాకు వ్యతిరేకంగా కొంత మంది ముస్లిం మహిళలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వారు రెండు రకాల వివాహాలపై నిషేధం కోరుతున్నారు.
లా కమిషన్‌తో సమావేశం గురించి ఎఐఎంపిఎల్‌బి ప్రతినిధుల బృందం మీడియాతో మాట్లాడింది. లా కమిషన్ పేర్కొన్న రెండు వివాహ విధానాలు దేశంలో పెద్దగా ఆచరణలో లేవని తెలిపారు.
అలాగే, వివాహానికి కనీస వయస్సు గురించి మాట్లాడుతూ ‘అబ్బాయిలు, అమ్మాయిలు వయస్సు వచ్చినప్పుడు వివాహానికి ఇస్లాం అనుమతిస్తుంది’ అని తెలిపారు. ఇస్లాంలో, వివాహానికి నిర్దిష్ట వయస్సు లేదని, భార్యాభర్తలు వివాహ బాధ్యతలను నెరవేర్చగల స్థితిలో ఉంటే, వారు వివాహం చేసుకోవచ్చని చెప్పారు. కాగా, ఈ సమావేశంలో ఉమ్మడి పౌరస్తృతి (యుసిసి)పై ముస్లిం ప్రతినిధితులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘యుసిసి నుంచి ఈశాన్య రాష్ట్రాల గిరిజనులు, క్రైస్తవులను మినహాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు ముస్లింలకు మాత్రమే ఎందుకు మినహాయింపు ఇవ్వడం లేదని, దీనికి అర్థం యుసిసి లక్ష్యం ముస్లింలు మాత్రమే అని తెలుస్తుంది’ అని లా కమిషన్‌తో చెప్పినట్లు సమాచారం.