ఆశ కార్యకర్తలకు 18 వేల వేతనాలు ఇవ్వాలి..

– సిఐటియు జిల్లా కార్యదర్శి ఆంజనేయులు.
నవతెలంగాణ – ఊరుకొండ 
గ్రామాల్లో ఆశా కార్యకర్తల చేత వెట్టి చాకిరి చేయిస్తున్న ప్రభుత్వం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా శ్రమకు తగిన కనీస వేతనం 18వేలు ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఆంజనేయులు ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు. శనివారం ఆశా కార్యకర్తల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని చేపడుతున్న సమ్మె కార్యక్రమంలో భాగంగా ఊరుకొండ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల ఆశా కార్యకర్తలు స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయడంతో పాటు వివిధ డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి ఆంజనేయులు ఆధ్వర్యంలో తహాసిల్దార్ చెన్న కిష్టన్న కు అందజేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ.. ఆశ వర్కర్లు గత 18 సంవత్సరాలుగా గ్రామాల్లో రిజిస్టర్లు రాయడం, వివిధ సర్వేలు చేయడం, బీపీ, షుగర్, థైరాయిడ్ తదితర అన్ని రకాల పరీక్షలు నిర్వహించి జబ్బులు గుర్తించడంతోపాటు ప్రభుత్వం మంజూరు చేసిన వివిధ మందులను ప్రతి ఒక్కరికి సరఫరా చేయడం వంటి ఎన్నో పనులు ఆశా వర్కర్లతో చేయిస్తూ నెలకు 7వేల రూపాయలు మాత్రమే అందించడం సరికాదని విమర్శించారు. పారితోషికం లేని అదనపు పనులు ఆశాలతో చేయించకూడదని.. టిబి స్పూటమ్ డబ్బాలను ఆశ వర్కర్లతో మోయించే పనిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టీబీ, లెప్రసీ, కంటి వెలుగు తదితర పెండింగ్ బిల్లును విడుదల చేయాలని కోరారు. లెప్రసీ సర్వేలో వస్తున్న ఇబ్బందులను తొలగించాలని.. వాలంటీర్లను నియమించాలని కోరారు. ఆశాలకు పని భారం తగ్గించి జాబ్ చార్ట్ ఏర్పాటు చేయాలని.. 2021 జులై నుండి డిసెంబర్ వరకు ఆరు నెలల పిఆర్సి ఏరియర్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరోనా నియంత్రణలో ఆశలకు ప్రతినెల 1000 రూపాయల చొప్పున 16 నెలల డబ్బులు చెల్లించాలని.. 32 రకాల రిజిస్టర్ లు ప్రభుత్వమే ప్రింట్ చేసి ఆశ వర్కర్లకు అందజేయలని కోరారు. ఆశ వర్కర్లకు ప్రసూతి సెలవుల పైన సర్కులర్ జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తల మండల అధ్యక్షురాలు ప్రభావతి, కోశాధికారి నర్మద, ఆశా కార్యకర్తలు వెంకటమ్మ, పద్మ, జంగమ్మ, రాధ, చంద్రకళ,   చెన్నమ్మ, బాలమని, మంజుల, అమృత, రాణి, భాగ్య, మణెమ్మ, సుజాత, తదితరులు పాల్గొన్నారు.