మహిళ దారుణ హత్య

– గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘటన
– మహిళపై లైంగికదాడి చేసి, హత్య చేసినట్టు అనుమానం?
నవతెలంగాణ-మియాపూర్‌
ఓ మహిళా దారుణ హత్యకు గురైన ఘటన రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి పోలీసుస్టేషన్‌ పరిధిలో మంగళవారం జరిగింది. గుర్తు తెలియని దుండగులు మహిళపై లైంగికదాడి చేసి అనంతరం బండరాయితో మోది హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గచ్చిబౌలి సీఐ జేమ్స్‌ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. గౌలిదొడ్డి కేశవనగర్‌ వడ్డెర బస్తీకి చెందిన కాశమ్మ (38) కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ నెల 26వ తేదీ నుంచి ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అదే రోజు గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని ఓ నిర్మాణ సంస్థలో మహిళ మృతదేహం ఉన్నట్టు స్థానికులు గుర్తించారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌లు ఆధారాలు సేకరించారు. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన మహిళ మిస్సింగ్‌ కేసును విచారించి హత్యకు గురైన మహిళ కాశమ్మగా గుర్తించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కాగా, నిర్మాణంలో ఉన్న ఈ భవనంలోకి మృతురాలు వేస్ట్‌ మెటీరియల్‌ సేకరించేందుకు వెళ్లినట్టు సమాచారం. ఈ ఘటనలో మహిళపై లైంగికదాడి చేసి, హత్య చేశారా లేదా మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని సీఐ చెప్పారు.