ప్రమాదంలో పత్రికా స్వేచ్ఛ

– న్యూస్‌క్లిక్‌ ఉదంతంపై ఎన్‌ రామ్‌
న్యూఢిల్లీ: దేశంలో పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడిందని ప్రముఖ పాత్రికేయుడు, హిందూ దినపత్రిక మాజీ సంపాదకుడు ఎన్‌.రామ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటన్‌ పత్రిక ‘ప్రాస్పెక్ట్‌’కు ఆయన ఓ వ్యాసం రాస్తూ భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛ దాడికి గురువుతోందని తెలిపారు.
న్యూస్‌క్లిక్‌కు చైనా నుండి నిధులు అందుతున్నాయని ఆరోపిస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌లో కథనం ప్రచురితమైన తర్వాత ఆ సంస్థపై బీజేపీ, ఆ పార్టీ నాయకులు, మంత్రులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థలు ముప్పేట దాడి చేసిన విషయం విదితమే. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తమపై వచ్చిన నిరాధార ఆరోపణలను న్యూస్‌క్లిక్‌ ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ ప్రబీర్‌ పుర్కాయస్థ తోసిపుచ్చారు.
న్యూస్‌క్లిక్‌పై వచ్చిన ఆరోపణలను రామ్‌ ఆ వ్యాసంలో ప్రస్తావించారు. న్యూస్‌క్లిక్‌పై ప్రభుత్వ ప్రోత్సాహంతో తప్పుడు ప్రచారం సాగించారని, భయాందోళనలు రేకెత్తించారని, దూషణల పర్వం సాగించారని ఆయన తెలిపారు. ఆ సంస్థ వ్యవస్థాపకుడిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు సైతం దిగారని వివరించారు.