నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
భారత్‌లో వైద్య విద్యను ప్రారంభించి అమెరికాలో పూర్తి చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు జేవియర్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. విద్యార్థులు మొదటి రెండేండ్లు ప్రీ-మెడ్‌ను బెలగావిలోని కెఎల్‌వి ప్రాంగణంలో లేదా హైదరాబాద్‌లోని హోమియోపతి మెడికల్ కాలేజీలో పూర్తి చేయాలని మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రీ-మెడ్‌ను పూర్తి చేశాక రెండేండ్లు జేవియర్ వర్సిటీ అరుబాలో ప్రి క్లినికల్ సైన్సెస్ (బేసిక్ సైన్సెస్) అధ్యయనాన్ని పూర్తి చేస్తారని పేర్కొంది. చివరి రెండేండ్లు హ్యాండ్స్ ఆన్ క్లినికల్ శిక్షణను అమెరికా, కెనడాలోని ఏసీజీఎంఈ ఆమోదించిన ఆస్పత్రుల్లో డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేస్తారని వివరించింది. అమెరికా, అరుబాలో ప్రవేశించడానికి సంబంధిత వీసా ప్రక్రియపై జేవియర్ ఇమ్మిగ్రేషన్ సిబ్బంది విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇస్తారని తెలిపింది. జేవియర్ విద్యార్థులు హెచ్1, జే1 వీసీ ప్రోగ్రామ్‌కు అర్హులని స్పష్టం చేసింది. ఇంటర్ లేదా 12వ తరగతి పూర్తి చేసి నీట్ స్కోర్ ఉన్నా లేకున్నా ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.