– ప్రభుత్వ రంగాల ప్రయివేటీకరణ ఆపాలి
– కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి : ఐఎప్టీయూ జాతీయ అధ్యక్షులు డా.అపర్ణ, ప్రొ.హరగోపాల్
నవతెలంగాణ-ముషీరాబాద్
కేంద్ర ప్రభుత్వం అంబానీ, అదానీలాంటి కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని ఐఎఫ్టీయూ జాతీయ అధ్యక్షులు డాక్టర్ అపర్ణ, ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ, అమ్మకాలను ఆపాలని, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, స్కీం వర్కర్‌లను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు లేబర్ కోడ్‌ను రద్దు చేయాలన్నారు. ఐఎఫ్‌టీయు ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. కార్మికుల జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లను అందంగా తీర్చిదిద్దే సఫాయి కార్మికుల జీవితాలు అందహీనంగా తయారవుతు న్నాయన్నారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని వాగ్దానం చేసిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారన్నారు. పెట్టుబడిదారుల చెప్పుచేతల్లో పాలన సాగిస్తున్న దేశ పాలకులు.. కార్మికుల కనీస వేతనాలు పెంచడం లేదన్నారు. మహిళా కార్మికుల శక్తి సామర్థ్యాలు గొప్పవని, వారి సమస్యల పరిష్కారం కోసం, హక్కుల కోసం పెద్దఎత్తున పోరాడాలని పిలుపునిచ్చారు. కొట్లాడే కార్మిక సంఘాలు భారత కార్మిక సంఘాల సమాఖ్య జెండా కింద నిర్మాణం అవ్వాలని కోరారు. డాక్టర్ అపర్ణ మాట్లాడుతూ.. దేశంలో ఆకలి అసమానతలు పెరుగుతున్నా యన్నారు. దేశ సంపద కొద్ది మంది పెట్టుబడిదారుల చేతుల్లో మాత్రమే పోగైందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. రైతుల పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికవర్గం సంఘటితంగా ఉద్యమాలు నిర్మించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జాతీయ ఉపాధ్యక్షులు బి.ప్రదీప్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.జనార్ధన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.భూమన్న, అరుణ, ఎన్.దాసు, సీహెచ్.భీమేశ్వర్, ఐ.కృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.