ఆస్కార్‌కు వేళాయె!

‘నాటునాటు’పై సర్వత్రా క్రేజ్‌ ఉదయం 5.30 గంటల నుంచి వేడుకలు షురూ
లాస్‌ ఏంజిల్స్‌: ప్రపంచ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆస్కార్స్‌ 2023 లేదా 95వ అకాడమీ అవార్డుల సంబరం రానేవచ్చింది. అవార్డుల ప్రదానోత్సవానికి అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో ఉన్న డాల్బీ థియేటర్‌ సర్వాంగ సుందరంగా ముస్తాబు అయ్యింది. భారత కాలమాన ప్రకారం ఈ నెల 13న సోమవారం ఉదయం 5.30 నుంచి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ప్రముఖ దర్శకులు ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ఆస్కార్‌ బరిలో నిలిచిన నేపథ్యంలో ఈ దఫా వేడుకలు భారత చలనచిత్ర రంగానికి విశేషమైనవి. గోల్డెన్‌ గ్లోబ్‌, హాలివుడ్‌ సినీ క్రిటిక్స్‌ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను కైవసం చేసుకొని ఇప్పటికే విశ్వవ్యాప్తంగా విశేష క్రేజ్‌ సంపాదించుకున్న ‘నాటునాటు’ పాట ఆస్కార్‌ను కైవసం చేసుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆస్కార్‌కు నామినేట్‌ అయిన తొలి భారతీయ సినిమా పాట ఇదే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగానూ ఉతృంఠ నెలకొంది. పలుచోట్ల ప్రత్యేక కార్యాక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఆస్కార్‌ వేదికపై ‘నాటునాటు’ పాట పాడేందుకు గాయకులు కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ లాస్‌ ఏంజిల్స్‌ చేరుకున్నారు. దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకులు ఎంఎం కీరవాణితో సహా ఆర్‌ఆర్‌ఆర్‌ బృందం కూడా లాస్‌ ఏంజిల్స్‌లోనే నేరుగా వేడుకలను ఆస్వాదించనుంది. ఆస్కార్‌ వేడుకల ప్రత్యక్ష ప్రసారాలను ఎబిసి నెట్‌వర్క్స్‌, అలాగే యూట్యూబ్‌, డైరెక్ట్‌ టివి, వంటి లైవ్‌ స్ట్రీమింగ్‌ వేదికల ద్వారా వీక్షించవచ్చు. భారత్‌లో డిస్నీ, హాట్‌స్టార్‌ ఛానెళ్లు ద్వారా వీక్షించవచ్చు.
అంతర్జాతీయ మీడియా అంచనా ఇలా..
ఆస్కార్‌ పురస్కారాల కంటే ముందుగా ప్రకటించే గ్లోడెన్‌ గ్లోబ్‌, హాలీవుడ్‌ సినీ విమర్శకుల అవార్డులకు ప్రత్యేక గుర్తింపు వుంది. ఈ రెండు అవార్డుల్లో ఏ ఒక్కదానిని కైవసం చేసుకున్నా ఆయా చిత్రాలకు, నటులకు ఆస్కార్‌ పక్కా అన్న విషయాన్ని గత చరిత్ర చెబుతోంది. వీటి ఆధారంగా అంతర్జాతీయ మీడియా ఆస్కార్‌ అవార్డులు దక్కెదెవరికో ముందుగానే జోస్యం చెబుతూ కథనాలు వెలువరించింది. ఆ కథనాల ప్రకారం.. అవార్డులు ఇలా ఉండే వీలుంది.
ఉత్తమ చిత్రం : ఎవరీ థింగ్‌ ఎవరీ వేర్‌
ఆల్‌ అట్‌ వన్స్‌
ఉత్తమ దర్శకులు : డేనియల్‌ క్వాన్‌, డేనియల్‌
సెచినర్ట్‌ (ఎవరీ థింగ్‌
ఎవరీ వేర్‌ ఆల్‌ అట్‌ వన్స్‌)
ఉత్తమ నటుడు : బ్రెండాన్‌ ప్రాజర్‌ ( ద వేల్‌)
ఉత్తమ నటి : మిఛెల్‌ యే
(ఎవరీ థింగ్‌ ఎవరీ వేర్‌ ఆల్‌ అట్‌ వన్స్‌)
ఉత్తమ సహ నటుడు: కె హురు క్వాన్‌ (ఎవరీ థింగ్‌ ఎవరీ వేర్‌ ఆల్‌ అట్‌ వన్స్‌)
ఉత్తమ సహ నటి : ఏంజిలా బస్సేట్ట్‌ (బ్లాక్‌ పాంథర్‌ : వకండా పారెవర్‌)
ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే : ఎవరీ థింగ్‌ ఎవరీ వేర్‌ ఆల్‌ అట్‌ వన్స్‌
ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే : ఆల్‌ క్విట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌
ఉత్తమ డాక్యుమెంటరీ : నవల్నేరు
ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ : నాటు నాటు (ఆర్‌ఆర్‌ఆర్‌)
ఉత్తమ యానిమేషన్‌ చిత్రం : గుయిలెర్మో డెల్‌ టోరోస్‌ పినోసిచియో
ఉత్తమ అంతర్జాతీయ చిత్రం : ఆల్‌ క్విట్‌ ఆన్‌ ద వెస్ట్రన్‌ ఫ్రంట్‌